Mallikarjun Kharge: ఇంకా ఇలా ఎన్నాళ్లు ? సీడబ్ల్యూసీ సమావేశంలో కడిగిపారేసిన ఖర్గే..

Mallikarjun Kharge: ఇంకా ఇలా ఎన్నాళ్లు ? సీడబ్ల్యూసీ సమావేశంలో కడిగిపారేసిన ఖర్గే..

ఢిల్లీ: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలపై ఏఐసీసీ హెడ్క్వార్టర్స్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమీక్ష జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. ఇకనైనా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సొంత పార్టీలోని వర్గ పోరుపై కూడా ఖర్గే కుండబద్ధలు కొట్టారు.

ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడటం మానేసి సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఉంటే రాజకీయంగా ప్రత్యర్థులను ఓడించి ఎలా గెలవగలమని ఖర్గే ప్రశ్నించారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు పార్టీకి చేటు చేస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల.. ఇకపై కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ నేత క్రమశిక్షణతో మెలగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. పార్టీలోని ప్రతీ నేత.. తన విజయమే.. కాంగ్రెస్ విజయంగా, తన ఓటమి కాంగ్రెస్ ఓటమిగా భావించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. 

ALSO READ | పొత్తు గిత్తు జాన్తా నై: ఢిల్లీలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి కాంగ్రెస్

ఇంకా ఎన్నాళ్లు జాతీయ స్థాయి నేతలపై, జాతీయ సమస్యలపై ఆధారపడి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతారని పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్థానిక సమస్యలే అజెండాగా రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుకెళ్లాలని మల్లిఖార్జున్ ఖర్గే సూచించారు. ఈవీఎం పద్ధతిలో ఎన్నికలు జరగడం ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియ పైనే అనుమానాలకు తావిస్తోందని, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఈ వ్యవహారంపై తక్కువగా మాట్లాడటమే మేలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేశారు. 

ఎప్పటిలా ఇకపై ముందుకెళతామంటే కష్టమని, మార్పు అనివార్యమని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సీనియర్ నేతల మధ్య విభేదాలు ప్రధాన కారణమని ఖర్గే చెప్పారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తదితర సీనియర్ నేతలు పాల్గొ్న్నారు.