బ్యాలెట్ బెస్ట్.. ఈవీఎంల విధానమే మోస పూరితం: మల్లికార్జున ఖర్గే

బ్యాలెట్ బెస్ట్.. ఈవీఎంల విధానమే మోస పూరితం: మల్లికార్జున ఖర్గే

ఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దేశాలు ఈవీఎంలను వదిలేసి బ్యాలెట్ వైపు వెళ్తున్నాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇవాళ అహ్మదాబాద్ లో జరిగిన న్యాయ్ పథ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలంటేనే మోస పూరితమని అన్నారు. అన్ని దేశాలూ ఈవీఎంలను వీడుతుంటే మనం మాత్రం వాడుతున్నామని అన్నారు. బ్యాలెట్ కావాలని యువత ఉద్యమించేందుకు సిద్ధమవుతోందని అన్నారు. 

రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆరోపించారు. మొన్న జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోసం ద్వారా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికార పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని విమర్శించారు.

"మహారాష్ట్రలో ఏం జరిగింది. మేము ఈ అంశాన్ని ప్రతిచోటా లేవనెత్తాం. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని బలంగా లేవనెత్తారు. వారు ఎలాంటి ఓటర్ల జాబితాను తయారు చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు ఒక మోసం. హర్యానాలో కూడా అదే జరిగింది" అని  అన్నారు. బీజేపీ 90% సీట్లు గెలుచుకుందని, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. పదకొండేండ్లుగా అధికార పార్టీ మోసానికి పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తన అనుకూల పెట్టుబడి దారుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.  కొంతమంది ఆశ్రిత పెట్టుబడిదారులకు వనరులను అప్పగించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి వెళ్లిపోతుందని ఆరోపించారు. మత తత్వాన్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐదు వందల  ఏండ్ల క్రితం జరిగిన ఘటనలను లేవనెత్తుతున్నారని అన్నారు.  పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం, ఎల్‌పిజి సిలిండర్ ధరను పెంచడాన్ని ఖర్గే తప్పుపట్టారు. అంతకుముందు, ఫిబ్రవరి 2023 రాయ్‌పూర్ సమావేశాల తర్వాత మరణించిన కాంగ్రెస్ సభ్యులకు నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది.

గత ఏడాది డిసెంబర్‌లో మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పార్టీ ఘనంగా నివాళులర్పించింది. సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు.