కాంగ్రెస్ కూటమికి 295 సీట్లు గ్యారంటీ: మల్లికార్జున్ ఖర్గే

కాంగ్రెస్ కూటమికి 295 సీట్లు గ్యారంటీ: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి 295లకు పైగా సీట్లు వస్తాయని  ఖర్గే చెప్పారు. బీజేపీ కేవలం 220 సీట్లు మాత్రమే గెలుస్తుందని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది మా సర్వే కాదు..ప్రజలు చేసిన సర్వే అని అన్నారు. ప్రధాని మోదీ తమ పార్టీకి (బీజేపీ) 400లకు పైగా సీట్లు వస్తాయని ప్రకటించిన క్రమంలో ఖర్గే వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

కాగా.. శనివారం (జూన్ 1)  న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో  ఇండియా కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, సీపీఐ ఎం, సీపీఐ, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) సీనియర్ నేతలు  పాల్గొన్నారు. భేటీలో కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పూర్తి మెజారిటీ సాధిస్తుందని నేతలు విశ్వాసం తో ఉన్నారు. 

Also Read:మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ

ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, జార్ఖండ్ సీఎం చంపై సోరేన్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే,  సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరీ,డీఎంకే నేత టీఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ, పీడీపీ నేత మహబూబా ముఫ్తీ డుమ్మా కొట్టారు.