మోదీ పాత ప్రసంగాలు ....దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు కప్పిపుచ్చలేవు :  మల్లికార్జున్‌‌ ఖర్గే

మోదీ పాత ప్రసంగాలు ....దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు కప్పిపుచ్చలేవు :  మల్లికార్జున్‌‌ ఖర్గే
  • కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయని కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌‌ ఖర్గే అన్నారు. మోదీ ఎల్లప్పుడూ పాత ప్రసంగాలే చేస్తున్నారని.. మళ్లీ మళ్లీ వాటిని పునరావృతం చేసినా దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చలేరన్నారు. మోదీనామిక్స్‌‌ దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిందని ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆయన హయాంలో గృహ రుణ భారం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయన్నారు. మేకిన్ ఇండియా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

2013–14 నుంచి 2022– 23 వరకు గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయని ఆరోపించారు. జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగిందన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజల ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మోదీ వినాశకరమైన విధానాలతో తయారీ రంగంలో పనిచేసే కార్మికుల వాటా 15.85 నుంచి 11.4 శాతానికి తగ్గిందన్నారు.