
- పార్టీ బలోపేతంలో డీసీసీలదే కీలక పాత్ర
- కష్టపడి పని చేసేవాళ్లకే పదవులు
- 14 రాష్ట్రాలు, 3 యూటీల డీసీసీలతో కాంగ్రెస్ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నదని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్లమెంట్ లోపల, బయట ఒంటరిగా కొట్లాడుతున్నదని తెలిపారు. ఈ పోరాటాన్ని గల్లీ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీ)దే అన్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఖర్గే నేతృత్వంలో గురువారం డీసీసీల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గల్లీ స్థాయిలో పార్టీ బలోపేతంలో డీసీసీలదే కీలక పాత్ర. మీరు మా దూతలు మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ జనరల్స్. క్షేత్రస్థాయిలో ముందుండి నడిపిస్తున్నది మీరే. లోకల్ లీడర్ల సిఫార్సుల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం కంటే.. ఈ స్థానాలకు అత్యంత సమర్థులైన, నిబద్ధత, కష్టపడి పనిచేసే వ్యక్తులను నియమించడం చాలా అవసరంగా భావిస్తున్నాం. అందుకే, రాహుల్ తో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాను’’అని ఖర్గే అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 240 సీట్లకు పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్య కుట్రను ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ క్యాంపెన్ ఛేదించిందన్నారు. ‘‘ప్రస్తుతం బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రెండు మిత్రపక్షాలపై ఆధారపడి ఉన్నది. మనం ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటే.. ఇంకో 20–30 సీట్లు వచ్చేవి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతుంటే.. పేదోడు అలాగే ఉండిపోతున్నాడు. దేశంలో నిరుద్యోగం పెరిగింది. పేదలు, అణగారిన వర్గాలు, మహిళలు, బలహీనవర్గాలపై దాడులు పెరుగుతున్నాయి. దీన్ని నిరూపించడానికి, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడానికే కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇండియన్స్‌ను అమెరికా అవమానించడం, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ నేతలు మతం పేరుతో అల్లర్లు సృష్టిస్తున్నారు. వీటిని తిప్పికొట్టేలా డీసీసీలు ఉండాలి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఐక్యం చేశారు.
బలమైన భావజాలం ఉన్నా.. అధికారం లేకపోతే అమలు చేయలేం. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని ప్రతి అభ్యర్థిని గెలిపించాలి’’అని ఖర్గే అన్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.
రాహుల్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం: తెలంగాణ నేతలు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నట్లు తెలంగాణ నేతలు అధిష్టానానికి వివరించారు. డీసీసీల సదస్సులో రాష్ట్రం నుంచి జగిత్యాల డీసీసీ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మంచిర్యాల డీసీసీ సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం. భారత్ జోడో యాత్ర దేశంతో పాటు తెలంగాణలోనూ పార్టీకి మైలేజ్ తెచ్చింది. ఎస్సీ వర్గీకరణ, 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించజేశాం’’అని తెలిపారు.