న్యూఢిల్లీ: పార్లమెంట్ లో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల వ్యవహారంతోపాటు పార్లమెంట్ బయట ఎంపీల తోపులాట అంశంతో ఉభయసభలు దద్దరిల్లాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో ఉభయ సభలు ఎలాంటి ప్రొసీడింగ్స్ జరగకుండానే మరునాటికి వాయిదా పడ్డాయి. కాగా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది.
ఉప రాష్ట్రపతి ప్రతిష్టను దిగజార్చేందుకు తీర్మానం ప్రవేశపెట్టారని పేర్కొంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దాన్ని తిరస్కరించారు. మరోవైపు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాజ్యసభలో కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. సభలో లీడర్ ఆఫ్ అపొజిషన్ మల్లికార్జున ఖర్గే ఈ మేరకు తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.