గోదావరిఖని, వెలుగు: పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తూ బీజేపీని మరింత బలోపేతం చేస్తానని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ మల్లికార్జున్ తెలిపారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులైన సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను బుధవారం హైదరాబాద్‌లో కలిసి బొకే అందజేశారు. ఆయన వెంట బీజేవైఎం స్టేట్ మీడియా సెల్ కన్వీనర్ కామ విజయ్ ఉన్నారు. కాగా మల్లికార్జున్‌ను బీజేపీ లీడర్ గడ్డం మధు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింగ్ దొర, తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, అడెపు రాజేందర్, సలీమ్, జి. రాము పాల్గొన్నారు.
నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలి
గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి
మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట చెరువుల్లో ఏర్పాట్లు
అధికారులతో మంత్రి కమలాకర్ సమీక్ష
కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లాలో 9వ తేదీన జరిగే వినాయక నిమజ్జనాలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మేయర్ సునీల్ రావుతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ శాంతి, సామరస్యానికి మారుపేరని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిమజ్జనం జరుపుకోవాలని ప్రజలను కోరారు. గణేశ్విగ్రహాలను మానకొండూర్ చెరువు, కొత్తపెల్లి చెరువు, చింతకుంట వద్ద కెనాల్లో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం పాయింట్ల వద్ద పకడ్బందీ బార్ కేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక్కొక్క పాయింట్ వద్ద రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లను మూడు షిప్టులలో నియమించాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
95 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఆరుగురి అరెస్ట్
మూడు వాహనాలు సీజ్
మెట్ పల్లి, వెలుగు: అక్రమంగా రేషన్తరలిస్తున్న నిందితులను అరెస్ట్‌చేసి 95 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సుధాకర్ బుధవారం తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి నుంచి మహారాష్ట్రకు బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందడంతో పట్టణ శివారులో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో బియ్యం తరలిస్తున్న 3 బొలేరో వాహనాలను సీజ్‌చేసి నాందేడ్ జిల్లా బోకర్ కు చెందిన షేక్ జీ(25), మెట్ పల్లి కి చెందిన మారుతి, నాందేడ్ కు చెందిన హాజీ, నిజామాబాద్ కు చెందిన షేక్ అబ్బాస్, జగిత్యాల కు చెందిన ఖాజా మొయినుద్దీన్, నాందేడ్ జిల్లా కిలామత్ కు చెందిన ముస్తఫాను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు.
పిల్లలకు మంచి వసతులు కల్పించాలి:జగిత్యాల కలెక్టర్ రవి
జగిత్యాల, వెలుగు: స్టూడెంట్స్ కు సరైన వసతులు కల్పించాలని జగిత్యాల కలెక్టర్ రవి అన్నారు. బీర్పూర్ మండలం చిత్ర వేణి గూడెం, మంగేల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలతో పాటు బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. హాస్టల్స్టోర్ రూం, కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. క్లాస్ రూమ్ కు వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడారు. హాస్టల్ లో ఎలాంటి టిఫిన్, భోజనం పెడుతున్నారని ఆరా తీశారు. నాణ్యమైన విద్య, భోజనం అందించి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేలా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓ మాధురి, ఎస్టీ జిల్లా ఆఫీసర్రాజ్ కుమార్ ఉన్నారు.
పిల్లలకు అదనపు ఆహారం ఇస్తాం:జడ్పీ చైర్ పర్సన్ అరుణ
సిరిసిల్ల టౌన్, వెలుగు : చిన్నారుల్లో పోషణ లోపాన్ని నివారించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేకంగా చిరుధాన్యాలతో అదనపు ఆహారం అందిస్తున్నామని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ పౌష్టిక లోపాలు ఉన్న బాలబాలికలను గుర్తించి వారి ఎదుగుదల కోసం న్యూట్రిషన్ మంత్ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదనపు ఆహారంగా రాగి జావ, రాగి లడ్డు, రాగి పాయసం, చిరుధాన్యాలు ఇస్తామన్నారు. ఆమె వెంట కౌన్సిలర్ సత్య ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్, సంక్షేమ అధికారులుపాల్గొన్నారు.
‘శాతవాహన’ సోషల్ సైన్సెస్ డీన్ గా సుజాత
కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో మొదటిసారిగా సోషల్ సైన్సెస్ కు ప్రొఫెసర్ సూరెపల్లి సుజాతను డీన్‌గా నియమిస్తున్నట్లు వీసీ డా.సంకశాల మల్లేశ్ బుధవారం తెలిపారు. సుజాత 2008లో యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్ మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గా, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కి డైరెక్టర్ గా, యూజీసీ నోడల్ ఆఫీసర్ గా పని చేసి 2022లో ప్రొఫెసర్ అయ్యారు. ప్రస్తుతం సోషియాలజీ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ గా పని చేస్తున్నారు.
సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు
సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గణేశ్శోభాయాత్ర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. బుధవారం సిరిసిల్లలో వినాయక ఉత్సవ కమిటీ మెంబర్స్, మత పెద్దలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తంగా 1,914 గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. డీజేలు, పటాకులకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విశ్వప్రసాద్, సీఐ అనిల్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండాలి:కలెక్టర్ అనురాగ్ జయంతి
వీర్నపల్లి, వెలుగు : అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలు వయస్సుకు తగ్గ బరువు ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. బుధవారం పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా వీర్నపల్లి మండలం వీర్నపల్లి, అడవిపదిర అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఐదేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చొరవ చూపాలన్నారు. ప్రతినెలా రెండో శనివారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మిల్లెట్ పుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని అన్నారు. ఆయన వెంట జిల్లా సంక్షేమ అధికారి లక్షీరాజం, సూపర్ వైజర్ లు ఉన్నారు.
కరెంట్ షాక్ తో రైతు మృతి
బోయినిపల్లి,వెలుగు: వాగులో నుంచి మోటార్‌ను పైగి లాగేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ లో బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన ఇల్లందుల పర్శరాం(40) కు మానేర్ వాగుకు దగ్గరలో భూమి ఉంది. దీంతో తన పొలానికి నీటిని తరలించేందుకు మానేర్ వాగులో మోటార్ బిగించాడు. అధికారులు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేస్తుండటంతో వాగులో నీటి ప్రవాహానికి మోటార్ కొట్టుకుపోతుందని భావించి పైకి లాగేందుకు బుధవారం రాత్రి వాగు దగ్గరికి వెళ్లాడు. మోటార్ పైకి లాగుతున్న సమయంలో కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కూతురు పూజ, కొడుకు పూర్ణచంద్ఉన్నారు.
టీచర్లు నవ సమాజ నిర్మాతలు:పెద్దపల్లి డీఈఓ మాధవి
సుల్తానాబాద్, వెలుగు: టీచర్లు నవ సమాజ నిర్మాతలని పెద్దపల్లి డీఈఓ మాధవి అన్నారు. సుల్తానాబాద్ విజ్ఞాన్ హైస్కూల్ లో ట్రస్మా పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యాయులను బుధవారం ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో టీచర్ల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు, రాష్ట్ర సలహాదారుడు కొమురయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి బుచ్చిరెడ్డి, ఓదెలు యాదవ్, కుమార్, ఉమామహేశ్వర్, రవీందర్, సంజీవ్ పాల్గొన్నారు.
శుభ్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి:పెద్దపల్లి కలెక్టర్ సంగీత
సుల్తానాబాద్, వెలుగు: గురుకుల స్కూళ్లు, హాస్టళ్లలో శుభ్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీత అన్నారు. స్వచ్ఛ వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై రోజువా రి పనులను ప్రణాళికాబద్ధంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. హాస్టల్ పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచాలని, క్వాలిటీ ఫుడ్ అందించాలని సూచించారు. వాటర్ ట్యాంక్ లను క్లీన్ చేసుకోవాలని అన్నారు. తర్వాత క్లాస్ రూమ్ లకు వెళ్లి స్టూడెంట్స్ తో విద్యాభ్యాసం, సదుపాయాల గురించి మాట్లాడారు. ఆమె వెంట వైస్ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సుజాత, రమేశ్ గౌడ్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.