- ఇది దేశంపై మత భావజాలాన్ని రుద్దే ప్రయత్నమే: ఖర్గే
- బుక్స్‌లో ప్రవేశిక చాలా క్లియర్‌గా ఉంది: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ 6వ తరగతి పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగ ప్రవేశికను తొలగించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది దేశంపై మతపరమైన భావజాలాన్ని రుద్దే ప్రయత్నమేనని తెలిపారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. "భారత రాజ్యాంగానికి ఆత్మ, పునాది అయిన ప్రవేశికను ఎన్నో ఏండ్లుగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలలో ప్రచురిస్తున్నాం. ఇది దేశంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం గురించి పౌరులకు వివరిస్తుంది. తద్వారా దేశ ఐక్యత, సమగ్రతను కాపాడవచ్చు.
దేశంలో పొలిటికల్ డెమొక్రసీని కూడా సోషల్ సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాల్సిన అవసరముంది. భావి తరానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సూత్రాలతోపాటు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. బుక్సులో రాజ్యాంగ ప్రవేశికను తొలగించి ప్రజలపై మతతత్వ భావజాలాన్ని రుద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న ఈ చర్య సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి" అని ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ మాట్లాడుతూ..బుక్సులో ప్రవేశికను తొలగించడం రాజ్యాంగ విలువలపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రశ్నిస్తున్నదని అన్నారు. ఇటీవల రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన తలతో తాకారని..అది రాజ్యాంగానికి 'వీడ్కోలు ముద్దు' అని ఇప్పుడు అర్థమైందన్నారు. సామరస్యం ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ప్రవేశికను తొలగించలేదు: ధర్మేంద్ర ప్రధాన్
ప్రవేశికపై కాంగ్రెస్ చీఫ్ చేసిన కామెంట్లకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి రాజ్యాంగ ప్రవేశికను తొలగించలేదని స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆరో తరగతి బుక్స్ లో రాజ్యాంగ ప్రవేశిక చాలా క్లియర్ గా ఉందని తెలిపారు. బుక్సులో రాజ్యాంగ ప్రవేశికను తొలగించారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
ఆరో తరగతి కొత్త పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగ ప్రవేశికతోపాటు ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, జాతీయ గీతం కూడా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ ద్వారా వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ..ఎక్కడా రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసే ప్రశ్నేలేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ డైనమిక్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉందన్నారు.
ఫైనాన్స్ బిల్లుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్
ఆర్థిక బిల్లును "ట్యాక్స్ ట్రాప్ ట్రాప్ బిల్లు"గా మార్చాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వ హయాంలో "రివర్స్ రాబిన్ హుడ్" సిండ్రోమ్ ప్రబలిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతోందని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. "రాబిన్ హుడ్ ధనవంతుల నుంచి డబ్బు దొంగిలించి పేదలకు పెట్టేవాడు.
మోదీ ప్రభుత్వం మాత్రం దానికి రివర్స్ చేస్తున్నది. ఫైనాన్స్ బిల్లులో అసంఘటిత రంగం, నిరుద్యోగ సంక్షోభం గురించి ప్రస్తావనే లేదు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చాలా ముఖ్యం. ఉద్యోగుల భద్రతపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. దేశంలో ఉన్న డాక్టర్ల కొరతను తగ్గించాలి" అని కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.