
గాంధీనగర్: బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ దేశంలో మతపరమైన ఉద్రిక్తలు రేకెత్తిస్తోందని.. ఏదైనా ఒక అంశంపై ప్రధాని మోడీ అగ్గి రాజేస్తాడు.. దానిపై ఆర్ఎస్ఎస్ పెట్రోల్ పోస్తుందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ తనను తాను వెనుకబడిన వ్యక్తిగా చెప్పుకుంటాడు.. కానీ వెనుకబడిన ప్రజలకు సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించడానికి ఆయన నిరాకరిస్తున్నారని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 9) ఖర్గే మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వక్ఫ్ చట్టాన్ని మతపరమైన ఉద్రిక్తతలకు కుట్ర అని అభివర్ణించారు. బీజేపీ పాలనలో రాజ్యాంగంపై నిరంతరం దాడి జరుగుతోందని.. మనం దానిని ఆపాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లోక్‌సభలో మాట్లాడటానికి అనుమతించకపోవడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం సభను తెల్లవారుజామున 3-4 గంటల వరకు నడిపింది.. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని విమర్శించారు.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిరాకరించారని.. అంటే ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటోందని అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా పెంచిన సుంకాలపై పార్లమెంటులో చర్చకు అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లను త్వరగా అమలు చేయాలని కోరారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుంటే.. ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఈవీఎంలకే కట్టుబడి ఉందని విమర్శించారు.
మీకు ప్రయోజనం చేకూర్చి ప్రతిపక్షాలను ఓడించే సాంకేతికతను మీరు తయారు చేశారు.. కానీ దీనికి వ్యతిరేకంగా నేడో, రేపో యువత గళమెత్తుతుందని.. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనేత్తారని గుర్తు చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం సవతి తల్లి వైఖరిని ఖర్గే తప్పుబట్టారు. ప్రధాని మోడీని ధనవంతుల స్నేహితుడని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి దేశం కోసం కాకుండా ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి మాత్రమే పనిచేస్తారని సెటైర్ వేశారు.