అబద్ధాలు చెప్తూ..యువత గాయాలపై ఉప్పు రుద్దుతున్నారు... ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్​

అబద్ధాలు చెప్తూ..యువత గాయాలపై ఉప్పు రుద్దుతున్నారు... ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్​

న్యూఢిల్లీ: దేశంలోని యువతకు 8 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించామన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధాని మోదీ ఒకదాని తర్వాత మరో అబద్ధం చెబుతూ యువత గాయాలపై ఉప్పు రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు. గత మూడు నాలుగేళ్లలో 8 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించడం ద్వారా.. నిరుద్యోగం గురించి బూటకపు కథనాలను వ్యాప్తి చేసేవారి నోళ్లు మూతపడ్డాయని గత వారం మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే విమర్శలు గుప్పించారు.

ఉపాధి కల్పనపై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికను ప్రధాని ఉటంకిస్తూ.. ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరత, వృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘‘మోదీ జీ.. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రశ్నార్థక డేటాపై మిమ్మల్ని ప్రశ్నించాలని మేము అనుకుంటున్నాం. మీరు పది సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి 12 కోట్లకు పైగా ఉద్యోగాలను ఎందుకు తొలగించారు?’’ అని ఖర్గే ట్వీట్ చేశారు.