
1980లో ఇందిరా గాంధీని మెదక్ జిల్లా గెలిపించిందని.. నర్సాపూర్ ప్రాంతమన్నా.. మెదక్ జిల్లా అన్నా.. సోనియా గాంధీకి ఇష్టమని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. బీహెచ్ఎల్, డీఆర్ డీఓ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలు ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు. కెసిఆర్ ఏం ఇచ్చాడని ప్రశ్నించారు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముకుల గ్రామ శివారులో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. దళితుల ఓట్లను దండుకొని కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. అసెంబ్లీలో ఉద్యోగం ఇస్తానని అనలేదని అబద్దాలు చెప్పి కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తి కోసం కాంగ్రెస్ క్యాలండర్ ను ప్రకటించిందని చెప్పింది.
ముఖ్యమంత్రి కాకముందు పోడు భూములకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. గిరిజనులు, ఆదివాసులను కూడా మోసం చేశాడని అన్నారు. ఓఆర్ఆర్, కాలేశ్వరం ప్రాజెక్టు, డబల్ బెడ్ రూమ్, ధరణి వంటి ప్రాజెక్టుల తో లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. మిగులు బడ్జెట్ తో వచ్చిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి, వృద్ధాప్య పింఛన్, డబల్ బెడ్ రూమ్ వంటి పథకాలకు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవన్నారు. ఇందిరమ్మను దూషించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిదని అన్నారు.
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశాడు రాహుల్ గాంధీ అందరినీ కలిశాడిన.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని.. లిక్కర్, మైనింగ్ మాఫియాలను మాత్రమే కేసీఆర్ కలుస్తాడని ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు పథకాన్ని నిలిపేస్తే.. కాంగ్రెస్ రైతుబంధు ఆపిందని కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి, గ్యాస్ సిలిండర్, మహిళల బస్సుఉచిత సౌకర్యం వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పారు.