మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావుల తల్లి మల్లోజుల మధురమ్మ మరణించారు. పెద్దపల్లిలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. నాలుగు నెలల క్రితం అనారోగ్యానికి గురై కోలుకున్న మధురమ్మ.. తిరిగి నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. విగత జీవిగా మారిన మధురమ్మను చూసి ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.
1973లో మధురమ్మ రెండో కుమారుడు మల్లోజుల కోటేశ్వరరావు ఉద్యమబాట పట్టగా, 1977లో చిన్న కుమారుడు వేణుగోపాల్‌రావు కూడా మావోయిస్టు పార్టీలో చేరాడు. 1997లో తండ్రి మరణించినా వారు అంత్యక్రియలకు సైతం హాజరు కాలేదు. 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మరణించాడు. కనీసం చిన్న కొడుకునైనా చూడాలని తపించిన మధురమ్మ ఆ ఆశ తీరకుండానే మరణించింది.