- 78 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ విజయకేతనం
మధిర/చింతకాని/ఖమ్మం రూరల్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ సునామీగా వస్తున్నది.. 78 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శుక్రవారం మధిర పట్టణంలో, చింతకాని మండల కేంద్రంలోని రామాలయం సెంటర్ లో, ఖమ్మం రూరల్లో మండలంలోని ప్రచారంలో వారు మాట్లాడారు. ప్రజల సంపద ప్రజలకు పంచాలనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు తీసుకువచ్చిందని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. పీజీలు డిగ్రీలు చదివిన యువత తిరిగి పల్లెల్లో భవన నిర్మాణ కార్మికులుగా, పెయింటర్లుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నందున బీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను తాకట్టుపెట్టి తెచ్చిన ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా బీఆర్ఎస్ పాలకులు లూటీ చేశారని మండిపడ్డారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేసిన నాగార్జునసాగర్, ఎస్ ఆర్ ఎస్పీ, శ్రీశైలం లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేసిన కాలేశ్వరం కుంగిపోవడం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమన్నారు.
దళిత మహిళ మరియమ్మను పోలీసులు చిత్రహింసలు పెట్టి లాకప్పులోచంపితే ఆమెపై తన పోరాటంలో భాగంగానే.. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చిన ఫలితమే.. దళిత బంధు పథకం వచ్చిందని భట్టి తెలిపారు. నెల రోజుల్లో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర నియోజకవర్గం దశా దిశా నిర్దేశించిందిగా ఉండాలన్నారు. మధిరలో చెరువులను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి మాస్టర్ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. పత్తి, మిర్చి, వరి, పసుపు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. రామాలయం సెంటర్ లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరారు. వారికి భట్టి, పొంగులేటి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.