హాలియా, వెలుగు : నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయకుండా, సాగునీరు ఇవ్వకుండా మంత్రి జగదీశ్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఏం చేస్తున్నారని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు అన్యాయం చేసిన వారిద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర సోమవారం నల్గొండ జిల్లా గుర్రంపోడ్మండలానికి చేరుకుంది. గుడిపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తి కావొస్తున్నా ఎస్ ఎల్ బీసీ టన్నెల్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు.
సుఖేందర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరే సుఖేందర్ రెడ్డి గత ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకు పొంతన ఉందా అని ప్రశ్నించారు. ఎస్ ఎల్ బీసీ పూర్తి చేసేందుకు నిధులు తీసుకురావాల్సిన మంత్రి.. నాగార్జున సాగర్ కాల్వలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. నాగార్జునసాగర్ కూడా కేసీఆరే కట్టాడన్న భ్రమలో జిల్లా మంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన గత లీడర్లంతా ప్రజల కోసం పనిచేశారే తప్ప మంత్రి జగదీశ్ రెడ్డిలా ఇసుక, భూదందా చేయలేదన్నారు. పాదయాత్రలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్శంకర్ నాయక్, నాయకులు కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, రంగినేని నర్సింహారావు, సూదిని జగదీశ్ రెడ్డి, జాల సత్తయ్య, వడ్డెగోని యాదగిరిగౌడ్, చలమల జగదీశ్ రెడ్డి, కమతం జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.