ధరణిలో ఎంట్రీ కాకుండా వందల ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను, రోడ్లకు ఇరువైపులా ఉన్న చాలా భూములను పెండింగ్ లో పెట్టిందని, ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించకోవడం లేదని, సంబంధిత అధికారులు తమ వద్ద ‘కీ’ లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టా పాస్ బుక్కుల్లో ఒకరి పేరు, కాస్తులో మరో వ్యక్తి పేరు ఉంటోందని, దీని వల్ల పట్టాల్లో పేర్లు ఉన్న వారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, అసలు లబ్ధిదారులకు అందడం లేదని చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని గన్నేర్లపల్లి గ్రామంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు.
ధరణి సమస్యలను తాము ఎత్తి చూపిస్తే సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గతంలో ఇంతకంటే మెరుగైన రెవెన్యూ వ్యవస్థ ఉండేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల తాము పేదలకు పంచిన భూములను ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేటీఆర్ నాది సన్యాసి యాత్ర అంటావా’ అంటూ విమర్శించారు.
‘‘నల్గొండ జిల్లాకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ కు కుర్చీ దొరకలేదా..? కొత్తగా చెరువులను తవ్విస్తే చెరువుల పండగా చేయాలి. నల్గొండ జిల్లాలో ఒక్క చెరువైన తవ్వారా..? కాంగ్రెస్ వాళ్లు ఉండబట్టే.. తెలంగాణ రాష్ట్రం ఉంది. స్వాతంత్య్రం రాక ముందు.. సాయుధ పోరాటానికి ముందు పంచిన భూములను లాక్కునేందుకు ధరణి తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో దున్నే వానికే భూమి కావాలని భూమి హక్కు కల్పించాం. ధరణి అతి పెద్ద కుట్ర. ధరణి సాఫ్ట్ వేర్ ను మారుస్తాం. అప్పటి రికార్డులను పొందు పరుస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం తెచ్చింది దొరలకోసం కాదని ప్రజల కోసమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తాను లేవనెత్తిన ప్రజా సమస్యలపై బయటకు వచ్చి మాట్లాడండి అని సవాల్ విసిరారు.