100 రోజుల్లో గ్యారెంటీల అమలు : మల్లు భట్టి విక్రమార్క

  • 100 రోజుల్లో గ్యారెంటీల అమలు..
  •  రాష్ట్రంలో 78 సీట్లతో కాంగ్రెస్​దే అధికారం
  • ఉమ్మడి ఖమ్మంలో పది స్థానాల్లో విజయం సాధిస్తం
  • సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కామెంట్స్
  • తుమ్మల, పొంగులేటితో కలిసి ర్యాలీ, ప్రెస్​మీట్ 

ఖమ్మం, వెలుగు : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, అధికార పార్టీ వేధింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చీమ చిటుక్కుమన్నా వాలుతామని భరోసా ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్​పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్​ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో భట్టి మీ డియాతో మాట్లాడారు. ఖమ్మం రూరల్​మండలం బారుగూడెంలోని తుమ్మల ఇంటి నుంచి జిల్లా కాంగ్రెస్ ​ఆఫీస్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
రాష్ట్రంలో రెండు పక్షాలు..

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 75 నుంచి 78 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్​అధికా రంలోకి రాబోతున్నదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి 10 సీట్లు గెల్చుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం రెండు పక్షాలుగా విడిపోయిందని భట్టి విక్రమార్క అన్నారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సంపద, వనరు లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఒక పక్షం ఉంటే, రాష్ట్ర సంపద, వనరులు దోచుకోవడానికి ముఠాగా తయారైన బీఆర్ఎస్ పార్టీ మరొక పక్షంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనుకునే వారంతా కాంగ్రెస్ పక్షం వైపు వస్తున్నారని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరే షన్ అన్నీ అమలు చేస్తాం. 6 గ్యారంటీలను 100 రోజు ల్లో అమలు చేస్తాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి ఇచ్చే గ్యారెంటీ కార్డులను ప్రతి ఒక్కరూ 3 నెలలు జాగ్రత్తగా దాచుకోండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి, అధ్యయనం చేసిన తర్వాతనే గ్యారెంటీ కార్డులు ప్రకటించాం” అని అన్నారు. బలవంతంగా గుంజుకున్న భూములను వెనక్కి తీసుకొని తిరిగి పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు.  

శక్తి వంచన లేకుండా పనిచేస్తా: తుమ్మల

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ చెప్పినట్టుగా, కాంగ్రెస్​ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో అమలు చేసే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అ న్నారు. అందరూ ఐక్యంగా ఉండి, సోనియా గాంధీ నిర్ణయానికి తగిన విధంగా వచ్చే ఎన్నికల్లో ఫలితాన్ని చూపించాలన్నారు. 

గ్రూప్​1 రద్దు సర్కారుకు చెంపపెట్టు: పొంగులేటి

మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. గ్రూప్​ వన్​ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకోవడం, దాచుకోవడం, ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పాల్సిన టైమ్​ వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్​అధ్యక్షుడు జావెద్, రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.