హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను 30 సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం సరైన పద్ధతి కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రైవేటు కంపెనీకి లీజు ఇచ్చే విషయంపై కోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పన్నులన్నిటినీ ఆదానీ, అంబానీలకు 30 ఏళ్ల పాటు కట్టబెట్టి.. ఇప్పుడే తీసుకునేటట్టు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క ఈ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా.. సీఎంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మీ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో బహిర్గతం చేయాలన్నారు. పార్లమెంట్ చట్టాలు కేసీఆర్ పట్టించుకోరని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా పోలీసులతో భూములను గుంజుకుంటోందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న బస్వాపూర్, తిమ్మాపూర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన 13 A ప్రకారంగా నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు మానసికంగా కుంగిపోతున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ ను ఖాళీ చేయడానికి చేపట్టిన కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. తెలంగాణలో దోపిడీ చేసి.. ఐదు లక్షల అప్పులు చేసి.. ఇతర రాష్ట్రాలలో సీఎం కేసీఆర్ డబ్బులు వేదజల్లుతున్నారని ఆరోపించారు.