- బీఆర్ఎస్ సర్కార్ విస్మరించిన పథకాలు పునరుద్ధరిస్తాం
- త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
భద్రాచలం, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిన ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆదివారం భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఐటీడీఏలకు అస్తిత్వం లేకుండా చేసిందన్నారు.
బీఆర్ఎస్విస్మరించిన పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని తెలిపారు. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని ప్రకటించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఎలాంటి ఆటంకాలు కల్గించొద్దని, అడవుల పెంపకంలో వారిని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. గిరిజన రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే 2009 ఆగస్టు 9న నాటి ప్రధాని మన్మోహన్సింగ్ తెచ్చిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ లో భాగంగా దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్ రెడ్డి భద్రాచలంలోని 3.50 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు.
పోడు భూముల్లో గిరిజన రైతులు ఆయుర్వేద మొక్కలు పెంచేలా అవగాహన కల్పించాలని, ఫలితంగా భద్రాచలంలో ఆయుష్ఫార్మసీ ఏర్పాటుకు బాటపడుతుందన్నారు. ధరణి కారణంగానే అసైన్డ్‌భూముల్లో సాగు చేస్తున్న రైతులకు పట్టా పాసు పుస్తకాలు రాలేదన్నారు. ధరణి ప్రక్షాళన పూర్తికాగానే పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భద్రాచలంలో కరకట్ట ఎత్తును పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్సీ సిబ్బందికి సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్లో ఉండే డాక్టర్లతో ఆన్లైన్ లో ట్రీట్మెంట్పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు, మిడ్డే మీల్స్ వర్కర్లకు ప్రతినెలా వేతనాలు అందిస్తామన్నారు.
19 నెలల తర్వాత మీటింగ్.. వాడీవేడిగా చర్చ
19 నెలల తర్వాత జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశం వాడీవేడిగా సాగింది. ప్రధానంగా విద్య, వైద్యం సంబంధిత సమస్యలను సభ్యులు లేవనెత్తారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐటీడీఏ విభజన వెంటనే చేయాలన్నారు. నాలుగు జిల్లాలకు విస్తరించి ఉండడంతో సమన్వయ సమస్య వస్తోందన్నారు. మూడు నెలలకోసారి తప్పనిసరిగా పాలకమండలి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాడుబడిన భవనాల్లో పిల్లలను ఉంచొద్దని చెప్పారు. కొండరెడ్ల గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. అన్నీ సౌకర్యాలు ఉన్నా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై మల్లు భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో డ్రాపౌట్స్, స్కూల్ తర్వాత కాలేజీల్లో చేరుతున్నారా? లేదా? చదువు తర్వాత ఉపాధి, ఉద్యోగాలు, వారి స్థితిగతులు ఏంటి? తదితర అంశాలన్నీ ఐటీడీఏలో ఉండాలన్నారు.
పదేళ్లలో గత ప్రభుత్వం ఏటా ఇచ్చిన బడ్జెట్ వివరాలు అందజేయాలని ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు చోట్ల వైటీసీలు ఏర్పాటు చేసి యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ ట్రైనింగ్స్ ఇస్తామన్నారు. ఇందుకు రూ.10కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. మారుమూల గిరిజన గ్రామాల్లోకి సైతం రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరతను పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకురాగా అవసరమైతే కాంట్రాక్టు బేసిస్లోనైనా నియామకాలు చేపట్టాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో మహబూబ్‌బాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అల, ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ తదితరులు పాల్గొన్నారు.