ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి : మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట, వెలుగు: వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌‌లో నాగార్జునసాగర్ ఆయకట్టు, ఎస్సారెస్పీ కింద సాగు చేసిన వరి పంట నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోయారు. రైతులు ఎకరాకు రూ. 40 వేల పెట్టుబడి పెట్టారని,  పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు అందడం లేదన్నారు.

 ప్రభుత్వం ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.  ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం  అడిషనల్  కలెక్టర్ బీఎస్‌‌ లతకు వినతి పత్రం  సమర్పించారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సైదా,  నాయకులు మందడి రామ్ రెడ్డి, కేవీపీఎస్‌‌ జిల్లా కార్యదర్శి కోట గోపి,  బెల్లంకొండ సత్యనారాయణ, ఏనుగుల వీరాంజనేయులు పాల్గొన్నారు.