దోపిడీ పీడనలను ఎదిరించి.. బరిగీసి నిలిచిన ఉక్కు మహిళ

దోపిడీ పీడనలను ఎదిరించి.. బరిగీసి నిలిచిన ఉక్కు మహిళ
  • మహిళా ఉద్యమానికి స్ఫూర్తి..

మహిళలను వంటగదికే అంకితం చేయాలన్న వివక్ష సాగుతున్న ఆ కాలంలోనే  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ పట్టి నిజాం నవాబు దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా బరిగీసి నిలిచిన ఉక్కు మహిళ మల్లు స్వరాజ్యం. ఆమె జీవితమంతా మహిళా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆమె స్ఫూర్తితో అనేక మహిళా ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. మహిళలు, మహిళా సంఘాలు ఎన్నో చట్టాలు సాధించుకోవడంలో ఆమె స్ఫూర్తి దాగి ఉంది.

తోటి మనుషుల కష్టాలను తట్టుకోలేక యుక్త వయసులోనే ఆయుధాలు పట్టుకున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటపు జీవనాడి మల్లు స్వరాజ్యం. ఉద్యమ నేలను నాగళ్లతో దున్ని మర పిరంగులను పండించిన ఆ వీర యోధురాలు1931లో నల్గొండ జిల్లాలో అర్ధ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. పదేండ్ల వయసులో తల్లి ప్రేరణతో మాక్సీం గోర్కి ‘అమ్మ’ నవలను చదివి ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపు మేరకు కుటుంబ కట్టుబాట్లను తెంచుకొని, పిడికిలి బిగించి ఉద్యమంలోకి ప్రవేశించారు.

పీడిత కులాల నుంచి వచ్చిన కార్మికులకు తిండి గింజలు పంపిణీ చేయడంతో ఆమె ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు.1946 లో నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు, సామాన్యులు ఆయుధాలు పట్టారు. ‘‘నిజాం మా సొంత భూముల్లో మమ్మల్ని బానిసలుగా మార్చాడు. కాబట్టి నిజాంతో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది”అని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. ఒక వైపు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతుంటే.. హైదరాబాద్ రాజ్యంలో మాత్రం నిజాం భూస్వాములు, రైతు కూలీల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్న సందర్భమది. ఎలాంటి జీత భత్యాలు లేకుండా భూస్వాముల కోసం ప్రజలు తమ సొంత భూముల్లో శ్రమించాల్సిన పరిస్థితి. దొరల దౌర్జన్యం తీవ్రంగా ఉండేది. అప్పటికే విద్యార్థులుగా ఉన్న భీంరెడ్డి నరసింహా రెడ్డి, రావి నారాయణరెడ్డిల కమ్యూనిజం ఆలోచనల వల్ల ప్రభావితమైన స్వరాజ్యం16 ఏండ్ల వయస్సు లో రైతులపై జరిగిన దారుణమైన దౌర్జన్యాలను దగ్గరుండి చూసి పోరాటానికి సిద్ధమయ్యారు. 
రజాకార్లతో పోరు..
గ్రామస్తులను సంఘటిత పరిచి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. గ్రామాల్లో గ్రంథాలయాలు నెలకొల్పడంతోపాటు చెట్ల కింద గ్రామీణులకు చదువు చెప్పించారు. దొడ్డి కొమురయ్య అమరత్వం స్ఫూర్తితో ప్రజలు భూమి విముక్తి, స్వేచ్ఛ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వరంగల్, నల్గొండ, ములుగు, నర్సంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ అంతటా ఉద్యమం దావానంలా వ్యాపించింది. అప్పుడు నినాదం దున్నేవాడిదే భూమి, గీసే వారిదే చెట్టు, భూమి కోసం, భుక్తి కోసం విముక్తి  కోసం ఈ పోరాటం ఆగదంటంటూ కొనసాగించారు. నిజాం పాలన విధ్వంసం రైతులకు ఉపశమనం కలిగించలేదు. ప్రజల జీవితాలను బాగు చేయాలనే నిబద్ధత ఆమెను ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యారు.

1945- – 48 దాకా జరిగిన సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడించారు. గెరిల్లా దళాలతో జరిగిన పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. రజాకార్లను దీటుగా ఎదుర్కొని నిలువరించారు. ఈ క్రమంలో కొంత కాలం అజ్ఞాతంలో ఉండిపోయారు. మల్లు స్వరాజ్యాన్ని పట్టుకోవడం చేతి కాని నైజాం పాలకులు.. ఆమె ఇంటిని తగులబెట్టారు. ఆమెను పట్టుకున్న వారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. కానీ దొరల పాచికలు పారలేదు. అజ్ఞాత కాలంలో రాజక్కగా పేరు మార్చుకొని మల్లు స్వరాజ్యం రహస్య జీవితం గడిపారు. 
ప్రత్యేక తెలంగాణ కోసం ఆరాటం
మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది త్యాగాలతో స్వరాజ్యం చలించిపోయారు. ప్రజలు కోరుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉన్నదని ఆ దిశగా పార్టీ ఆలోచించాలని కేంద్ర నాయకత్వానికి ఆమె చాలాసార్లు కటువైన లేఖలను సంధించారు. ఆ పార్టీని తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే విధంగా అంతర్గతంగా స్వరాజ్యం తీసుకొచ్చిన ఒత్తిడి అనిర్వచనీయమైనది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పోరాటపటిమను అనేక ఉద్యమాల్లో నిరూపించారు.   - పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక