ఇంట్లకెల్లే పోరు షురూ చేసిన మల్లు స్వరాజ్యం

  •     నా దళంల 20 నుంచి 30 మంది దాకా ఉంటుండె
  •     నిజాం రాజు అప్పట్లనే నా తల మీద 10 వేల రివార్డు పెట్టిండు
  •     మా నాయన సామ్రాజ్యం అని పేరు పెడితే.. స్వరాజ్యం అని అమ్మ మార్చింది
  •     ఇప్పటోళ్లకు అప్పటి చరిత్ర తెల్వదు.. బడులల్ల ఆ పాఠాలూ చెప్పరు
  •     తెలంగాణ సాయుధ పోరాటంపై ‘వీ6 వెలుగు’తో మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమెది చెరగని సంతకం. పదమూడేళ్ల వయస్సులోనే పోరుబాట పట్టి పల్లెపల్లె తిరిగిన ఆమె.. పదహారేళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్​ చేతబట్టారు. పుట్టింది దొరల కుటుంబంలోనైనా.. ఆ దొరస్వామ్యంపైనే తిరుగుబాటు జెండా ఎత్తారు. ‘బాంచెన్​ దొర.. నీ కాల్మొక్తా’ అంటూ బానిసత్వంలో మగ్గిన మట్టి మనుషులతో దళం కట్టారు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించారు. అతడి తాబేదారులుగా ఉంటూ ప్రజలను హింసిస్తున్న దొరలు, దేశ్​ముఖ్​లపై పోరాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నాటి రైతాంగ సాయుధ పోరాట యోధ మల్లు స్వరాజ్యం జ్ఞాపకాలు ఆమె మాటల్లోనే..

– నల్గొండ అర్బన్​, వెలుగు

బ్రిటిష్​ సామ్రాజ్యానికి అనుకూలంగా ఉన్న మా నాన్న నాకు మొదట సామ్రాజ్యం అని పేరు పెట్టారట. అయితే నాడు జరిగిన స్వాతంత్రోద్యమం నుంచి స్ఫూర్తితో మా అమ్మ చొక్కమ్మా నాకు స్వరాజ్యం అని పేరు మార్చారు. నా జీవితానికి గొప్ప ప్రేరణనిచ్చిన వ్యక్తి మా అమ్మే. మహిళలు.. పురాణాలు, మతగ్రంథాలకే పరిమితమైన ఆ రోజుల్లోనే నన్ను మాగ్జిమ్​​గోర్కి రాసిన ‘అమ్మ’ నవలను చదివేలా చేసింది ఆమెనే. దున్నే వాడికే భూమి కావాలని, వెట్టి చాకిరీ పోవాలని 12  ఏళ్ల వయస్సులోనే దొరల పాలనను వ్యతిరేకించిన. మాదీ దొరల కుటుంబమే. అది 1943 అనుకుంట. ఒక రోజు మా ఇంట్లో దళితులతో రోళ్లలో ధాన్యాన్ని దంపిస్తున్నారు. ఓ మహిళ కుప్పకూలి పడిపోయింది. ఏమైందని అడిగితే ఆకలితో కళ్లు తిరిగిపడిపోయిన అని చెప్పింది. నేను వెంటనే ఇంట్ల నుంచి అన్నం తెచ్చి పెట్టిన. మిగతా వాళ్లు కూడా ఆకలిగా ఉందని, నూకలు పెట్టమని అడిగితే తీస్కపోయి ఇచ్చిన. అది చూసిన బాబాయ్​.. నన్ను మందలించిండు. ఆకలితో ఉన్నోళ్లకు అన్నం ఎందుకు పెట్టొద్దని ఎదురు తిరిగిన. అట్ల ఇంట్లనే షురూ అయింది నా మొదటి తిరుగుబాటు. ఆ తర్వాత మా ఏరియా దొరలు, దేశ్​ముఖ్​లు, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరు కొనసాగింది.

వెట్టిపై పోరాడినం

ప్రజలకు కూలీ కూడా ఇవ్వకుండా దొరలు తమ సొంత భూముల్లో వెట్టి చేయించుకునేటోళ్లు. దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమించింది. ఇప్పటి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండిలో గొర్రెల కాపరి దొడ్డి కొమురయ్యను విసునూర్​ దేశ్​ముఖ్​ రామచంద్రారెడ్డి హత్య చేయడంతో తిరుగుబాటు మరింత రాజుకుంది. ఇలా రగిలిన ఉద్యమం వరంగల్, నల్గొండ, ములుగు, నర్సంపేట, కరీంనగర్​, ఆదిలాబాద్​ వరకు అంటుకుంది. సాయుధ పోరాటం నడిచే రోజుల్లో జరిగిన ఒక ఘటన నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. ధర్మపురం తండాకు చెందిన నలుగురు అన్నదమ్ములు కమ్యూనిస్టు పార్టీలో చేరిండ్రు. ఈ విషయం ఆ గ్రామంలోని దొరలకు తెలిసి పోలీసులకు చెప్పారు. వాళ్లను పోలీసులు పట్టుకెళ్తే పోరాడి విడిపించుకున్నం. తర్వాత ఆ ఊర్లో సభ పెడితే ఆరుట్ల రామచంద్రారెడ్డి వచ్చి జనాన్ని మరింత చైతన్యపర్చారు. అయితే, పోలీసులు రామచంద్రారెడ్డిని రైస్​మిల్లులో బంధిస్తే.. ప్రజలను కూడగట్టి మిల్లుపై దాడి చేసి బంధీఖానా నుంచి విడిపించినం. ఇది నేనెప్పటికీ మరచిపోలేని ఘటన.

నిజాం గద్దె దిగినా..

నిజాం గద్దె దిగిపోయిన తర్వాత కూడా రైతులకు ఏ మాత్రం ఊరట కల్గలే. అధికారం నిజాం చేతుల నుంచి యూనియన్​​సైన్యాల చేతులల్లకు పోయింది. ప్రజలకు దొరలు, దేశ్​ముఖ్​ల పీడన పోలేదు. మా పోరాటంతో ఊర్లు వదిలి వెళ్లిన దొరలు యూనియన్​ సైన్యం అండతో మళ్లీ ఊర్లకు వచ్చి పేదలకు పంచిన భూములను లాక్కున్నరు. దీంతో మా పోరాటం ఇంకా కొనసాగించాల్సి వచ్చింది. ఆ పోరులో 40 మంది కమ్యూనిస్టు నాయకులు, మూడున్నర వేల మంది కార్యకర్తలు  హత్యకు గురయ్యారు. మట్టి పిసికిన రైతులు, కూలీలు ఆయుధాలు ఎందుకు చేతపట్టారన్న విషయం ఇప్పటోళ్లకు పెద్దగా తెల్వదు. ఈ పోరాట చరిత్రను స్కూళ్లలో చెప్పరు. అప్పట్లో చదువులేకపోయినా పాటలతో, మాటలతో ప్రజలను చైతన్య పరిచినం. నేడు కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలను బానిసలుగా మారుస్తున్నరు. 1978, 1983లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించారు. కానీ ఇప్పుడు ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్లకే ఓటేస్తున్నరు. చదువు, చైతన్యం ఉండి కూడా డబ్బుల మాయలో పడి దోచుకునే వారికే ఓటు వేసి గెలిపిస్తుండడం చూస్తుంటే చాలా బాధ​
కలుగుతుంది.

300 మంది మహిళలకు ట్రైనింగ్​

అప్పట్లో సరైన బడుల్లేవు. కొంత వరకే చదువుకున్నా. మా అన్న, అక్క, ఇద్దరు మేనబావలు కమ్యూనిస్టులే. వాళ్లతో ఉద్యమంలో పాల్గొనేందుకు నేను కూడా వెళ్లేది. మా అన్న, కమ్యూనిస్టు నేత భీంరెడ్డి నర్సింహారెడ్డితో పాటు రావి నారాయణరెడ్డి మాటల  ప్రభావం నాపై చాలానే ఉంది. రైతాంగ సాయుధ పోరాటంలో చాలా మంది భూస్వాముల పిల్లలూ కీలక పాత్ర పోషించారు. రైతులు, కూలీలపై దొరల ఆగడాలను సహించలేక 16 ఏళ్లకే తుపాకీ చేతపట్టిన. నా దళంలో 20 నుంచి 30 మంది ఉండేటోళ్లు. అప్పటి ఆర్మీ మేజర్​ జైపాల్​ సింగ్​ మాకు తుపాకీ పేల్చడంలో ట్రైనింగ్​ ఇచ్చారు. నా తలపై నిజాం ప్రభుత్వం అప్పట్లోనే 10 వేల రూపాయల రివార్డు ప్రకటించింది. అయినా నేనెప్పుడూ పట్టుబడలేదు. ప్రజలే మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నరు. సాయుధ పోరాటంలో 300 మందికిపైగా మహిళలు ట్రైనింగ్​ తీసుకున్నరంటే.. పోరాటంలో వాళ్ల పాత్రేంటో అర్థం చేసుకోవచ్చు.