అన్యాయంపై తిరగబడిన ధీర వనిత మల్లు స్వరాజ్యం : మంత్రి సీతక్క

అన్యాయంపై తిరగబడిన ధీర వనిత మల్లు స్వరాజ్యం : మంత్రి సీతక్క
  • మమ్మల్ని మేము చక్కదిద్దుకోవడానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు
  • మూడో వర్ధంతి సభలో మంత్రి సీతక్క

ముషీరాబాద్, వెలుగు: పేదలకు జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు జెండా ఎగర వేసిన ధీర వనిత మల్లు స్వరాజ్యం అని మంత్రి సీతక్క కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జీవితాంతం పోరాడారన్నారు. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఐద్వా(అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మల్లు స్వరాజ్యం మూడో వర్ధంతి సభ నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. మల్లు స్వరాజ్యం ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతక్క మాట్లాడుతూ.. మమ్మల్ని మేము చక్కదిద్దుకోవటానికి, జనాలతో మమేకం కావడానికి మల్లు స్వరాజ్యం ఎంతో స్ఫూర్తినిచ్చారన్నారు. అగ్రకులంలో పుట్టి వందల ఎకరాల భూములు, ఆస్తిపాసులు ఉండి కూడా పేదల పక్షాన పోరాడిన మహా యోధురాలు అని కొనియాడారు.

ట్యాంక్ బండ్ పై ఆమె విగ్రహం పెట్టే విషయమై సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. 8 దశాబ్దాలు సాగిన ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా ఏనాడూ మల్లు స్వరాజ్యం వెనక్కి తగ్గలేదన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ సంధ్య, పి.జ్యోతి, అనసూయ, స్వరూప, బత్తుల హైమావతి, కేఎన్ ఆశలత, వినోద, శశికళ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.