16 ఎంపీ సీట్లు గెలిచి సోనియమ్మకు గిఫ్ట్ ఇద్దాం : మల్లు రవి

16 ఎంపీ సీట్లు గెలిచి సోనియమ్మకు గిఫ్ట్ ఇద్దాం : మల్లు రవి
  •    ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మల్లు రవి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిపించి సోనియాగాంధీకి రెండో గిఫ్టుగా ఇద్దామని ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మల్లురవి పేర్కొన్నారు. బుధవారం నాగర్ కర్నూల్  ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీసులో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీకి చెప్పినట్లు తెలిపారు. అస్సాంలో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుల దాడిని ఖండించారు. ప్రాజెక్టుల్లో 10 శాతం పెండింగ్​ పనులను పూర్తి చేయకుండా బీఆర్ఎస్  ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు.  

ఉమ్మడి జిల్లాలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీలో తనవంతు కృషి చేస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్​లో ట్రైబల్  యూనివర్సిటీ అడ్మిషన్స్  ప్రారంభించడానికి ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్​ పరిధిలో ఒక ఇండస్ట్రీ కూడా లేదని, తాను ఎంపీగా పోటీలో ఉంటున్నానని, గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సర్వేలు కూడా తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. టీపీసీసీ సభ్యుడు వల్లభ రెడ్డి, హబీబ్, నిరంజన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

మల్లు రవికి ఘన స్వాగతం

ఆమనగల్లు : ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులై తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గాన్ని వచ్చిన మల్లు రవికి కాంగ్రెస్  పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కడ్తాల్, ఆమనగల్లులో అంబేద్కర్, రాజీవ్​గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శెట్టిపల్లి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్  జడ్పీ వైస్  చైర్మన్  బాలాజీ సింగ్ తో కలిసి రిలీజ్​ చేశారు.

ప్రధాన రహదారిపై నిర్వహించిన రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేశారు.ఎంపీపీలు కమ్లి, అనిత, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, యాట నరసింహా, మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జగన్,గు ర్రం కేశవులు, జహంగీర్  బాబా, సత్యం, కృష్ణ నాయక్, యాదయ్య పాల్గొన్నారు.