ఏటూరునాగారం/ తాడ్వాయి, వెలుగు: కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు. గురువారం ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ 420హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని సరిగా నెరవేర్చలేదన్నారు. దీంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కవితను గెలిపించాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. అంతకు ముందు మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, జడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ సలీం, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.