
మామూలుగా ట్రావెలింగ్ చేసేవాళ్లకు విదేశాలకు వెళ్లాలనే ఆశ ఉంటుంది. దానికి కారణం అక్కడి ప్రదేశాలు, వాతావరణం, కల్చర్, చారిత్రక కట్టడాలు.. ఇలా మరెన్నో కారణాలు ఉంటాయి. అయితే, మాల్టా దేశానికి వెళ్లడానికి అక్కడున్న మ్యూజియం కూడా ఒక కారణం కాబోతుందట! ఎందుకంటే..
యూరోపియన్ దేశమైన మాల్టాలో కాంటెంపరరీ ఆర్ట్ కోసం మ్యూజియం ఏర్పాటు చేశారు. దాన్ని 2024 చివరిలో ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఆ దేశంలో కాంటెంపరరీ ఆర్ట్ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి మ్యూజియం ఇది. ఆ మ్యూజియం పేరు ‘మాల్టా ఇంటర్నేషనల్ కాంటెంపరరీ ఆర్ట్ స్పేస్’. దీన్నే మికాస్ (MICAS) అని పిలుస్తారు. ఇది మాల్టా రాజధాని నగరంలో ఉంది. 90వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ మ్యూజియంలో ఎటు చూసినా అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తాయి. ఇక్కడ శిల్పకళ, పెయింటింగ్స్ వంటివి ఉన్నాయి. రానున్న రోజుల్లో విజిటర్స్ కోసం మరిన్ని కళాఖండాలతో స్వాగతం పలకనుంది ఈ మ్యూజియం.
అంతేకాదు.. 2026లో అవుట్డోర్ స్కల్ప్చర్ గార్డెన్, కేఫ్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యూజియం డెవలప్ అయ్యేకొద్దీ ప్రపంచ పర్యాటకులందరి దృష్టి దీని మీద పడుతుందని అంటున్నారు అక్కడి ఆర్టిస్ట్లు. ముఖ్యంగా అమెరికన్ టూరిస్ట్లను మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ట్రావెలింగ్ చేసేవాళ్లకు మాల్టాని విజిట్ చేయడానికి ఇది మరో కారణం అవుతుంది.