చెంగ్డౌ (చైనా): ఇండియా షట్లర్ మాళవిక బన్సొద్ చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మరిస్క టుంజుంగ్‌కు షాకిస్తూ రెండో రౌండ్ చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 43వ ర్యాంకర్ మాళవిక 26–24, 21–19తో ఏడో ర్యాంకర్ మరిస్క (జార్జియా)ను వరుస గేమ్స్‌లో ఓడించింది. ఇతర ఇండియా షట్లర్లంతా నిరాశపరిచారు.
ఆకర్షి కశ్యప్ 15–21, 19–21తో చియు పిన్ చియన్ (తైపీ) చేతిలో, సామియా ఫరూఖీ 9–21, 7–21తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) చేతిలో ఓడారు. డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ 21–16, 15–21, 17–21తో తైపీ జోడీ సె పెయి షాన్–హుంగ్ ఎన్ జు చేతిలో పోరాడి ఓడగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి 10–21, 16–21తో టాన్ మెంగ్ –లై పెయి జింగ్ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. సతీష్–ఆద్య, రుతపర్ణ-–శ్వేతపర్ణ జోడీలు పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ కూడా ఇంటిదారి పట్టారు.