లక్ష్మణచాంద(మామడ)/లోకేశ్వరం, వెలుగు: నిషేధిత చైనా మాంజా అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని మామడ ఎస్సై సందీప్ హెచ్చరించారు. మంగళవారం మామడ మండల కేంద్రంలోని కిరాణా షాపులు, పతంగుల దుకాణాలను ఎస్సై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకరమైన చైనా మాంజా వాడకంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిషేధిత చైనా మాంజాను కిరాణా షాపుల్లో అమ్మితే వారిపై చట్టపురమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకేశ్వరంలో తనిఖీలు
చైనా మాంజాతో పతంగులు ఎగురవేసి ప్రమా దాలు తెచ్చుకోవద్దని లోకేశ్వరం ఎస్సై అశోక్ కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని కిరాణా షాపులను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఎవరైనా దుకాణదారులు చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలో విద్యార్థులకు చైనా మాంజా ద్వారా కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
అలాగే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు సూచనలను, సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఏఎస్ఐ దిగంబర్, సిబ్బంది పాల్గొన్నారు.