
వక్ఫ్ సవరణ చట్టం అమలు క్రమంలో పశ్చిమబెంగాల్ చెలరేగిన హింసలో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం మమతా బెనర్జీ రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు కేంద్రంలోని బీజేపీనే కారణమని మమతా బెనర్జీ అన్నారు.
వందలాది హిందూ కుటుంబాలు ఇళ్లు వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అల్లర్ల సమయంలో బీఎస్ ఎఫ్ కాల్పులు జరిపిందన్నారు. ముర్షిదాబాద్ లో హింస వెనక బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అన్సరుల్లా బంగ్లా టీం లకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలను మమత ఖండించారు.
బంగ్లాదేశీయులు ఇందులో పాల్గొంటే, వారిని లోపలికి రావడానికి BSF ఎందుకు అనుమతించిందని ప్రశ్నించారు. హింసను రెచ్చగొట్టేందుకు బిజెపి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోంది.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి బాధ్యత వహించాలని అన్నారు. హోం మంత్రిత్వ శాఖ ,హోం మంత్రిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీని కోరారు.
హైకోర్టుకు బాధిత కుటుంబాలు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ బాధితుల కుటుంబాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి.తమ ఇళ్లపై బాంబులతో దాడి జరిగినప్పుడు పోలీసులు తమకు సహాయం చేయడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. స్పందించిన కోర్టు కేసు నమోదు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ముర్షిదాబాద్ హింసాకాండలో దాదాపు 300 కుటుంబాలను నిరాశ్రయిలయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 240 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి అదుపులో ఉంది. జంగిపూర్లోని సంసెర్గంజ్ మినహా జిల్లా అంతటా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించారు.