దీదీ చేయాల్సింది ఎంతో!

పశ్చిమ బెంగాల్​లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక… ఈ పదేళ్లలో మిగతా రంగాల సంగతి ఎలా ఉన్నా విద్యా రంగం కాస్త ముందడుగేస్తోందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. గడచిన ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రంలో గవర్నమెంట్​ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల సంఖ్య పెద్దఎత్తున పెరిగింది. వాటిలో చేరుతున్న స్టూడెంట్ల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. కానీ.. క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించే విషయంలో మాత్రం చేయాల్సింది ఇంకా చాలా ఉందని అనలిస్టులు అంటున్నారు. దీనికి కారణాలూ లేకపోలేదు.

మమతా బెనర్జీ పవర్​లోకి రాకముందు (2011లో) పశ్చిమ బెంగాల్​లో 12 యూనివర్సిటీలే ఉంటే ఇప్పుడు అవి 46కి చేరాయి. ఉన్నత విద్యలో చేరిన స్టూడెంట్ల సంఖ్య 2010–11లో 13.24 లక్షలు మాత్రమే అయితే ఆ సంఖ్య 2017–18 నాటికే 20 లక్షలు దాటిందట.

లక్ష మందికి 12 కాలేజీలే!

పశ్చిమ బెంగాల్​లోని మొత్తం కాలేజీలు 1,341. దీంతో లక్ష జనాభాకి ఉన్న కాలేజీల సంఖ్య 12 మాత్రమే. అంటే ఒక్కో కాలేజీలో సగటున 1,170 మందికి చదువు చెప్పాలి. దేశం మొత్తం మీద ప్రతి లక్ష మందికి 28 కాలేజీలు ఉండగా ఒక్కో కాలేజీ యావరేజ్​ ఎన్​రోల్​మెంట్​ 698. ఈ డేటాను బట్టి ఇతర రాష్ట్రాలతో పోల్చితే పశ్చిమ బెంగాల్​ ఎంత వెనకబడ్డదో అర్థమవుతోంది. హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూషన్లు, అందులోనూ క్వాలిటీ స్టడీని మెయింటైన్​ చేసేవి చాలా రావాల్సిన అవసరముందని విద్యావేత్తలు చెబుతున్నారు. 2010–11లో(లెఫ్ట్​ ప్రభుత్వం) విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్​ కన్నా 2017–18లో(దీదీ హయాంలో) చేసిన ఖర్చు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2018–19లో టీఎంసీ సర్కారు 18.2 శాతం బడ్జెట్​ని ఈ​ సెక్టార్​కి ఇచ్చింది. చదువు కోసం 18 రాష్ట్రాలు​ యావరేజ్​గా పక్కన పెట్టిన ఫండ్స్​ కన్నా ఇది ఎక్కువ. అంతేకాదు. 2011–18లో యూనివర్సిటీల సంఖ్య 26 నుంచి 46కి పెరిగింది. ఇందులో 19 స్టేట్​ పబ్లిక్​ యూనివర్సీలతోపాటు సెంట్రల్​, డీమ్డ్​, అదర్​ కేటగిరీ యూనివర్సిటీలు ఉన్నాయి.

యూపీ, మహారాష్ట్ర కన్నా ఎక్కువే

విద్యా రంగానికి సుమారు రూ.13 వేల కోట్ల కేటాయింపుతో పశ్చిమ బెంగాల్​ టాప్​లో ఉంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ కూడా దాని తర్వాతే ఉన్నాయి. యూజీసీ​, ఎంసీఐ, ఏఐసీటీఈ తదితర సంఘాల గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల సంఖ్య 855 నుంచి 1,849కి చేరింది. ఇందులో కొత్త గవర్నమెంట్​ కాలేజీలు 31 కాగా ఎయిడెడ్​ కాలేజీలు 15. డార్జిలింగ్​, సౌత్​ దినాజ్​పూర్​, అలిపుద్వార్​, ముషీదాబాద్​, బిర్భుంలలో ఐదు యూనివర్సిటీలు రానున్నాయి.

ఫ్యాకల్టీనీ ఇచ్చారు

టీచింగ్​, నాన్​–టీచింగ్ కేటగిరీల్లో 2,816 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చారు. చాలా మంది లెక్చరర్లనూ నియమించారు. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేశారు. పశ్చిమ బెంగాల్​లో ప్రస్తుతం టీచర్​ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూషన్లు 655 ఉన్నాయి. ఇందులో ఎక్కువ కాలేజీలు 2014–15 నుంచే ప్రారంభమైనట్లు ఎన్సీటీఈ (ఈస్టర్న్​ రీజనల్​ కమిటీ) రిపోర్ట్​ చెబుతోంది. 2011–18లో ఏడు కొత్త యూనివర్సిటీలతోపాటు 47 కొత్త కాలేజీలు ఏర్పాటుచేశారు.

టోటల్​ ఎన్​రోల్​మెంట్​లో.. టాప్​–5లో..

2013–14లో దేశంలోని మొత్తం స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో చేరిన స్టూడెంట్స్​ రేషియో 19.4 పర్సంటేజ్​ కాగా పశ్చిమ బెంగాల్​లో 17.5 శాతంగా నమోదైంది. టోటల్​ ఎన్​రోల్​మెంట్​ విషయంలో పశ్చిమ బెంగాల్​ జాతీయ స్థాయిలో టాప్​–5లో నిలిచింది. అయినా ఆ రాష్ట్రం ఈ దిశగా చేయాల్సిన ప్రయాణం ఎంతో మిగిలి ఉంది.