మమత హ్యాట్రిక్ సీఎం కావడం కష్టమే!

మమత హ్యాట్రిక్ సీఎం కావడం కష్టమే!

ఒకప్పుడు కమ్యూనిస్ట్​ల కంచుకోట వెస్ట్ బెంగాల్. 34 ఏండ్ల పాటు ఏకధాటిగా పాలించిన ఆ పార్టీని మమతా బెనర్జీ ఒంటిచేత్తో మట్టికరిపించారు. మొదట్లో కాంగ్రెస్‌‌లో ఉన్న ఆమె 1997లో సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తన పోరాటాలతో ఫైర్‌‌‌‌ బ్రాండ్‌‌గా పేరు తెచ్చుకున్నారు. 2011లో లెఫ్ట్ సర్కారును దించి బెంగాల్ సీఎం అయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే 2019 లోక్‌‌సభ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలోనూ బలం పుంజుకున్న బీజేపీ ఆమెకు స్ట్రాంగ్ అపోజిషన్‌‌గా మారింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్య నువ్వా, నేనా అన్నట్టు టఫ్‌‌ ఫైట్ ఉండబోతోంది. బీజేపీ బలాన్ని ఎదుర్కొని మమత మళ్లీ సీఎం అయ్యి హ్యాట్రిక్ కొట్టడం అన్నది కష్టంగానే కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌‌లో 2016 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లో మమతా బెనర్జీకి ఏ పార్టీ ఎదురు నిలవలేకపోయింది. 2011లో గెలిచాక ఆమె ఫస్ట్ టర్మ్ పాలనపై ప్రజల నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. దీంతో 2016 ఎన్నికల్లో 294 సీట్లకు గానూ 211 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే 2014లో మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఆ తర్వాత అన్ని రాష్ట్రాలపై పట్టు సాధించడం మొదలుపెట్టింది. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. 2019 లోక్​సభ ఎన్నికల నాటి బీజేపీ బలమైన ప్రతిపక్షం స్థాయికి చేరింది. ఆ రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాల్లో 18 చోట్ల గెలిచి సత్తా చాటింది. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ ఈ ఏడాదిలో రాబోయే ఎన్నికల్లో ఆల్టర్నేటివ్​గా ప్రజల్లో గుర్తింపు పొందే స్థాయికి ఎదిగింది.

లోకల్ ఫీలింగ్‌‌, ముస్లిం ఓటర్స్ మమతకు ప్లస్

బెంగాలీలకు తమ భాష, సంస్కృతి, చరిత్రపై ఎంతో ప్రేమ. బెంగాల్‌‌లో పుట్టినందుకు తాము ఎంతో గర్విస్తారు. ఆ లోకల్ ఫీలింగ్ మమతకు ప్లస్ అనే చెప్పాలి. ‘ఔట్ సైడర్’ బీజేపీపై పోరాడుతున్న బెంగాలీగా తనను ఆమె ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బీజేపీ ఎదుగుదల మొదలైనప్పటి నుంచి కూడా.. ఆ పార్టీకి బెంగాల్‌‌ గొప్పతనం తెలియదని, మనల్ని అర్థం చేసుకోలేదని చెబుతూ వస్తున్నారు. అలాగే బీజేపీని యాంటీ ముస్లిం పార్టీగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా తనకు అండగా ఉన్న ముస్లిం ఓటుబ్యాంక్‌‌ను ఆమె కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో దాదాపు 27 శాతం ముస్లిం ఓటర్లున్నారు. అందులో దాదాపు 90% ముస్లిం ఓటర్లు ఆమెకు అండగా ఉన్నారని అంచనా. బీజేపీ గెలిస్తే బంగ్లాదేశ్‌‌ నుంచి వచ్చిన శరణార్థులను వెనక్కి పంపేస్తుందన్న భయం కూడా మమతకు కలిసొచ్చే అంశం.

కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీలను కలుపుకొనే చాన్స్

ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌‌గా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్‌‌‌‌ను ఈ ఎన్నికల్లో తన సలహాదారుగా మమతా బెనర్జీ నియమించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ప్రణాళికలను ఆయన సాయంతో తృణమూల్ సిద్ధం చేసుకుంటోంది. 2011 ఎన్నికల టైమ్‌లో సీపీఎం, కాంగ్రెస్ బెంగాల్‌‌లో బలమైన రాజకీయ పక్షాలు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు పూర్తిగా వీక్ అయ్యాయి. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి 6% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈ టైమ్‌లో అవి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేవు. గతంలో శత్రువులుగా ఉన్న ఆ పార్టీలను ఇప్పుడు ఉమ్మడి శత్రువైన బీజేపీపై పోరాడేందుకు మమత పొత్తుకు యత్నిస్తున్నారు.  యాంటీ బీజేపీ, ముస్లిం ఓట్లు చీలకుండా చూసుకోవచ్చన్నది ఆమె ఉద్దేశం.

యాంటీ బీజేపీ పాలసీతో లొల్లి

పశ్చిమ బెంగాల్‌‌లో బీజేపీని ఎదగనీయకూడదన్న ఆలోచనతో మమతా బెనర్జీ యాంటీ బీజేపీ పాలసీ తీసుకుని కేంద్రంతో ఎప్పుడూ లొల్లి పెట్టుకుంటూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్‌‌ను కూడా రాష్ట్ర ప్రజలకు చేరనీయలేదు. ప్రజలకు నేరుగా చేరే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను వాళ్లకు అందనీయలేదు. అలాగే అనేక సెంట్రల్ స్కీమ్స్‌‌ ద్వారా వచ్చే డబ్బులు కూడా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఫండ్స్ ఇస్తే తాము ఖర్చు చేస్తామని ఆమె మొండిపట్టు పట్టారు. దీని వల్ల కేంద్ర పథకాల నుంచి వచ్చే బెనిఫిట్ రాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. మరోవైపు మమతపై యాంటీ హిందూ అనే ముద్ర వేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింలకు మమత ఆశ్రయం ఇవ్వడం ద్వారా బెంగాల్‌‌ను ముస్లిం స్టేట్‌‌గా మార్చేస్తారన్న ఆరోపణలను జనంలోకి బలంగా తీసుకెళ్లింది. సిటిజన్‌‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకు మన దేశ పౌరసత్వం ఇస్తామని ప్రకటించడం ద్వారా హిందూ ఓటర్లలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని చెప్పొచ్చు.

వారసత్వం, రాజీనామాలు పెద్ద నెగెటివ్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బెంగాల్‌‌లో ఇప్పటి వరకూ వారసత్వ రాజకీయాలన్నవి లేవు. కానీ తొలిసారి మమతా బెనర్జీ తన పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్‌‌లో తన తర్వాత స్థానం ఇస్తున్నారు. ఇది బెంగాల్ ఇమేజ్‌‌ను దెబ్బతిస్తోందన్న ఫీలింగ్ ఆ పార్టీ నేతల్లో ఉంది. మరోవైపు పార్టీలో మమత తర్వాత సెకండ్ ప్లేస్ అనే స్థాయికి ఏ ఒక్క నేతనూ ఎమర్జ్ కానీయకుండా చేయడంపైనా తృణమూల్ సీనియర్ లీడర్స్ అంతా గుర్రుగా ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు, యాక్టర్స్ ఉన్నా.. ఎవరికీ యాక్టివ్ రోల్ ఇవ్వడం లేదు. ఇటీవల సీనియర్ నేతలు, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేసి బీజేపీలో చేరుతుండడం చూస్తేనే రాష్ట్రంలో మమత, తృణమూల్ ఇమేజ్ ఎంతగా డౌన్ అయిందన్నది అర్థం చేసుకోవచ్చు.  ఆ పరిణామాలతో దీదీలో భయం మొదలైంది. ఆమె రెండు చోట్ల పోటీ చేస్తారన్న ప్రచారం  ఉంది.

ఆమె తీరే ట్రబుల్స్ తెచ్చిపెట్టింది

మమతా బెనర్జీ చాలా అగ్రెసివ్ లీడర్. ఆమె నిత్యం కేంద్రంతో గొడవలకు దిగుతూ, కాంట్రవర్సీలకు సెంటర్‌‌‌‌గా మారారు. కొంత కాలం మాత్రమే ఈ తీరును ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అదే తీరు కంటిన్యూ చేయడం వల్ల అభివృద్ధి దూరమయ్యామన్న ఫీలింగ్ ప్రజల్లో ఉంది. అగ్రెసివ్‌నెస్ వల్ల ఆమె తనకు తానే శత్రువుగా మారారు. ఈ రకమైన అగ్రెసివ్, కాంట్రవర్షియల్ లీడర్లకు ఓటమి తప్పదని చరిత్ర చెబుతోంది. 24 ఏండ్ల పాటు సీఎంగా చేసిన జ్యోతి బసు చాలా డిగ్నిఫైడ్ మ్యాన్, కానీ నిత్యం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ పోవడం వల్ల ఓటమి పాలయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్‌‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సైలెంట్‌‌గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిన నవీన్ పట్నాయక్ లాంటి నేతలే ఎక్కువ కాలం పదవిలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తించాలి. అయితే ఈ పరిస్థితుల్లో బెంగాలీలు మార్పు కోరుకుంటున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఒకవేళ వాళ్లు మార్పు కోరుకుంటే మమతకు సీఎంగా హ్యాట్రిక్ మిస్ అవ్వడం ఖాయం.

పదేండ్ల పాలనలో కొరవడిన డెవలప్‌‌మెంట్

పశ్చిమ బెంగాల్‌లో పదేండ్లుగా మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. దీంతో ఆమె పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం చాలా సహజం. బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో 1700 నుంచి 1911 వరకు మన దేశ రాజధానిగా బెంగాల్ ఉండేది. వందల ఏండ్ల పాటు ఇండస్ట్రీలకు సెంటర్‌‌‌‌గా నిలిచింది. కానీ మమత సీఎం అయ్యిందే ఇండస్ట్రియలిస్ట్ వ్యతిరేక పోరాటాలతో. దీంతో పొలిటికల్‌‌గా ఆమె పాలసీలు ఎకానమీ గ్రోత్‌‌కు ఉపయోగపడలేదు. దీంతో ఆ రాష్ట్రంలో అంతగా డెవలప్‌‌మెంట్ జరగలేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరగకపోవడంతో ప్రజల్లో పేదరికం అలానే ఉంది.

పోరాటాలతో గెలిచిన ఏకైక మహిళా సీఎం

ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న ఏకైక మహిళా సీఎం మమతా బెనర్జీ. ఒక రకంగా చూస్తే ఒంటరిగా పోరాడి గెలిచిన ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆమే  అని చెప్పాలి. గతంలో తమిళనాడులో జయలలిత, బీహార్‌‌‌‌లో రబ్రీ దేవి, కాశ్మీర్‌‌‌‌లో మెహబూబా ముఫ్తీ వంటి వారు ప్రాంతీయ పార్టీల నుంచి సీఎంలుగా చేశారు. అయితే జయలలితను ఎంజీఆర్ తన వారసురాలిగా ప్రకటించారు. అలాగే బీహార్‌‌‌‌ సీఎంగా ఉండగా లాలూప్రసాద్ దాణా స్కామ్‌‌లో ఇరుక్కోవడంతో తన భార్య రబ్రీ దేవికి ఆ పదవిని కట్టబెట్టారు. ఇక కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా కొంత మంది పవర్‌‌‌‌ఫుల్ విమెన్ లీడర్స్‌‌ ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ఒంటరిగా పార్టీ పెట్టి, తన పోరాటాలతో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న  సీపీఎంను ఓడించి స్వశక్తితో అధికారంలోకి వచ్చిన డైనమిక్​ లీడర్ దీదీ. వరుసగా రెండు టర్మ్స్‌‌ నుంచి సీఎంగా ఉన్న ఆమెకు ఇప్పుడు టఫ్‌‌ టైమ్ నడుస్తున్నట్లే కనిపిస్తోంది.

– పెంటపాటి పుల్లా రావు, పొలిటికల్ ఎనలిస్ట్

For More News..

డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ పీస్ ప్రైజ్‌‌

అప్పుడేమో పాస్ చేస్తమన్నరు.. ఇప్పుడేమో పరీక్ష రాయాలంటున్నరు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే స్టడీ లోన్స్