- ఆ దేశంలో యూఎన్ శాంతి
- పరిరక్షణ దళం ఏర్పాటయ్యేలా చూడాలి: మమతా బెనర్జీ
కోల్కతా: పొరుగుదేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ దేశంలో మైనార్టీల భద్రత కోసం యూఎన్ శాంతి పరిరక్షణ దళాన్ని ఏర్పాటు చేసేలా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. “బంగ్లాదేశ్లో మనవాళ్లు, మన కుటుంబాలు, ఆస్తులు ఉన్నాయి. అక్కడ మనవాళ్లపై దాడులు జరుగుతున్నాయి. నేను అక్కడి ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడాను. అక్కడ పరిస్థితులను చక్కబెట్టేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం స్వాగతిస్తం” అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంట్లో చర్చ జరగాలని, ఈ అంశంపై మాట్లాడేందుకు మోదీ అందుబాటులో లేకుంటే.. విదేశాంగ మంత్రిత్వ శాఖ అయినా స్పందించాలని కోరారు. బంగ్లాదేశ్లో హింసకు గురైన భారతీయులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, వారికి మనదేశంలో పునరావాసం కల్పించాలని అన్నారు. ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తాము తినే ‘రోటీ’ (రొట్టె)ను వారితో పంచుకోవడానికి తమకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు.