ఒక్క స్టేట్​ గెలిచినంతమాత్రాన..ఢిల్లీని గెలవలేరు

ఒక్క స్టేట్​ గెలిచినంతమాత్రాన..ఢిల్లీని గెలవలేరు

రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఒక దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇలా చెప్పేవారట. ‘‘నేను వచ్చాను. నేను చూశాను. నేను జయించాను” అని అనేవారట. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్​మమతా బెనర్జీ కూడా జులై 27న ఎన్నో ఊహాగానాల మధ్య కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చారు. కానీ కాంగ్రెస్ చీఫ్​సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ చీఫ్​రాహుల్ గాంధీతో మీటింగ్ తర్వాత మమత పూర్తిగా నిరాశకు గురైనట్లు స్పష్టంగా తేలిపోయింది. జూలియస్ సీజర్ మాదిరిగా.. ‘‘నేను వచ్చాను. ఢిల్లీని జయించాను” అని మమత చెప్పలేకపోయారు. దీంతో ఆమె ప్రస్తుతానికి బెంగాల్ కు మాత్రమే క్వీన్ అని, ఢిల్లీని ఎంత మాత్రమూ గెలుచుకోలేదని స్పష్టం అయిపోయింది.  

ఊదరగొట్టిన మీడియా 

మమత గత మే నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ ఆమె జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారన్న ప్రచారం జోరందుకున్నది. బెంగాల్ విజయంతో మమత గొప్పతనాన్ని మీడియా ఎక్కువ చేసి చూపించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీని ఎదుర్కోగల ఏకైక దీటైన ప్రత్యర్థిగా ఆమెను తెరమీదకు తెచ్చింది. మోడీకి ఎదురొడ్డి పోరాడేందుకు రాహుల్ గాంధీ పూర్తిగా అన్ ఫిట్ అని ఎంతో మంది పొలిటికల్ అనలిస్టులు తేల్చేశారు. అపొజిషన్ పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని, మోడీని ఓడిస్తానని బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మమత ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను మమత లీడ్ చేస్తారని, దేశవ్యాప్తంగా బీజేపీని ఓడిస్తారంటూ గత రెండు నెలలుగా దాదాపు ప్రతిరోజూ పత్రికా ప్రకటనలు వచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీ పాలిటిక్స్ లోకి మమత ప్రవేశం పట్ల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు మమత ఢిల్లీకి రానే వచ్చేశారు.     

ఆ ఫొటోనే అంతా చెప్తోంది.. 

అపొజిషన్ పార్టీల తరఫున మమతా బెనర్జీయే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని జోరుగా ప్రచారం చేశారు. పీఎం క్యాండిడేట్ గా తానే ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రమే మమతకు అడ్డంకిగా మారారన్న భ్రమలు కల్పించారు. సోనియా, రాహుల్ తో భేటీ అయ్యేందుకే మమత ఢిల్లీకి వచ్చారని, ప్రధాని క్యాండిడేట్ గా పోటీ విషయంలో రాహుల్ సంతోషంగా మమతకు చాన్స్ ఇచ్చి, రేసులో నుంచి తప్పుకుంటారని చాలా మంది రాజకీయ నేతలు, మీడియా సంస్థల వారు భావించారు. కానీ ‘‘ఒకే ఒక్క ఫొటో వేల మాటలకు సమానం” అని గతంలోనే ఎంతో మంది చెప్పారు. ఒక పుస్తకం మొత్తం చెప్పలేని విషయాన్ని ఒకే ఒక్క ఫొటో తెలియజేస్తుందని మొన్న సోనియా, రాహుల్ ను మమత కలిసిన సందర్భంగా బయటకు వచ్చిన ఫొటోనే చెప్తోంది. గతంలో మాదిరిగా సోనియా, రాహుల్ తో మమత సంతోషంగా ఉన్న ఫొటో ఒక్కటి కూడా కన్పించలేదు. పైగా సోనియా, రాహుల్ ఇద్దరూ వాళ్లింటి తలుపు దగ్గరే నిలబడి ఉండగా, మమత ఎలాంటి నవ్వు ముఖం లేకుండానే వెనుదిరిగి వస్తున్నప్పుడు తీసిన విచారకరమైన ఓ ఫొటో మాత్రమే బయటకు వచ్చింది. ఈ సీన్ లో సోనియా, రాహుల్ ముఖాల్లో కూడా ఎలాంటి చిరునవ్వు కన్పించలేదు. మరోవైపు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మమతను కారు వరకూ సాగదోలేందుకు కూడా వెంట ఎవరూ లేరు. ఈ ఒక్క ఫొటోనే వాళ్ల మీటింగ్ ఒక డిజాస్టర్ గా మిగిలిపోయినట్లు మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. 

  • ఢిల్లీలో సోనియా, రాహుల్ ను కలవడానికి ముందు అనేక ప్రతిపక్ష పార్టీలకు చెందిన మధ్యస్థాయి నాయకులను మమత కలిశారు. అపొజిషన్ కు నాయకత్వం వహించే నేతగా ఆమె ఆల్రెడీ విజయం సాధించారన్నంతగా మీడియా కథనాలు ప్రసారం చేసింది. సోనియా, రాహుల్ తో మీటింగ్ తర్వాత కేజ్రీవాల్ తోనూ మమత భేటీ అయ్యారు. కానీ ఎప్పటినుంచో ఆయన మమతకు మద్దతు ఇస్తున్నందున, ఈ భేటీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ముందు నుంచే మమతకు సపోర్ట్ గా ఉన్నారు. అందువల్ల ఆయనతో భేటీ కావడం కూడా పెద్ద విజయంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొత్తంగా మమత ఏదైతే ఆశించి, ఢిల్లీ టూర్ కు వచ్చారో.. అది సక్సెస్ కాలేదనే చెప్పాలి. అపొజిషన్ లోని అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ రూపంలో మమతకు అతిపెద్ద సవాలు ఎదురైందనే అనుకోవాలి. మోడీకి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీని పక్కకు తప్పించేందుకు మమత చాలా గొప్ప ప్రయత్నమే చేశారన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ మమత ఢిల్లీ టూర్ తో మరిన్ని అడ్డంకులు తెరపైకి వచ్చాయి. 
  • దాదాపు 200 ఎంపీ సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. నేడు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికార పార్టీ. ఏడు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మమత తృణమూల్ మాత్రం ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది.  
  • అపొజిషన్ కు నాయకత్వం వహించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటే.. అది పర్మనెంట్ గా తన స్థానాన్ని కోల్పోతుంది. అసలు సమస్య ఏంటంటే.. నరేంద్ర మోడీని ఓడించడం కంటే రాహుల్​ను  ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ప్రధాన మంత్రి పదవి పట్ల రాహుల్ గాంధీ కూడా ఆశతోనే ఉన్నారు. 
  • జనరల్ ఎలక్షన్స్ 2024లో జరుగుతాయి. బహుశా మమత చాలా తొందర పడుతుండొచ్చు. కానీ మిగతా పార్టీలన్నీ ఆఖరి నిమిషం వరకూ వేచి చూడాలని భావిస్తున్నాయి. యూపీ, గుజరాత్ లో 2022లోనే ఎన్నికలు రానున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చాలా మంది నేతలు అనుకుంటున్నారు. 
  • ప్రధాని పదవి పట్ల మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఆశతో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఎవరు పీఎం కావాలన్నా.. మోడీని తప్పకుండా ఓడించాల్సి ఉంటుంది. అందుకే వీళ్లు బీజేపీపై పోరాటం చేస్తున్నారు. ప్రధాని పదవి మీద వీరికి ఆశ లేకపోతే.. ఇద్దరూ అపొజిషన్ పార్టీలకు నాయకత్వం వహించే అంశంపై వెనక్కి తగ్గేవారు. 
  • కాంగ్రెస్ తప్పనిసరిగా తమ అలయెన్స్ లో ఉండాలని మమత, శరద్ పవార్ కోరుకున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం లీడర్ గా ఉండకూడదని ఆశిస్తున్నారు. 

మమతకు మంచి అడ్వైజర్లు అవసరం 

మమత, సోనియా మధ్య మీటింగ్ ఏమంత బాగా జరగలేదు. కానీ ఇరు పక్షాలూ మౌనం పాటించాయి. చివరకు మమత తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు. ‘‘భవిష్యత్తులో అపొజిషన్ పార్టీల మధ్య తప్పకుండా యూనిటీ వస్తుంది” అని అన్నారు. దీని అర్థం ఏమిటంటే.. వాళ్ల లక్ష్యాల మధ్య ఘర్షణ ఏర్పడుతున్నందున, ప్రస్తుతానికి ప్రతిపక్షాల మధ్య ఎలాంటి ఐక్యత రాలేదనే. ఈ మొత్తం పరిణామాలను చూస్తే.. జులై 28న జరిగిన మమత, గాంధీల మీటింగ్ పూర్తిగా ఫ్లాప్ అయినట్లు తేలిపోయింది. మమత తన ప్లాన్ లపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఢిల్లీని జయించడం చాలా ఈజీ అని ఆమె అనుకున్నారు. ఒక రాష్ట్రాన్ని గెలవడం మాత్రమే సరిపోదని ఇప్పుడు తెలుసుకున్నారు. ఐకే గుజ్రాల్1997లో కనీసం ఒక్క ఎంపీ కూడా లేకుండానే ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు మమతకు మరిన్ని స్కిల్స్, మంచి అడ్వైజర్లు అవసరం. ఢిల్లీ పీఠం ఆమె కోసమే ఎదురు చూస్తోందంటూ భజనలు చేసేవాళ్ల మాటలను ఆమె ఇకపై వినకూడదు. 

- పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్