చేనేత వస్త్రాల ప్రమోషన్​కు కృషి చేస్తా

  • మిసెస్​ ఇండియా తెలంగాణ 2017 విజేత మమత త్రివేది
  • భూదాన్  పోచంపల్లిలో చేనేత దుస్తులతో ర్యాంప్​వాక్​
  • పాల్గొన్న మిసెస్​ తెలంగాణ, ఏపీ -2023 ఫైనలిస్టులు

భూదాన్ పోచంపల్లి, వెలుగు: భూదాన్ పోచంపల్లి చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయని, వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తన ఫ్యాషన్ షోల ద్వారా ప్రమోట్ చేస్తున్నానని 2017 మిసెస్​ఇండియా (తెలంగాణ) విజేత మమత త్రివేది అన్నారు. ఆదివారం భూదాన్  పోచంపల్లిలో పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు చేనేత వస్త్రాలు ధరించిన మమతా త్రివేది, మిసెస్​ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2023 ఫైనలిస్టులు ర్యాంప్​వాక్ ​చేశారు. 

మమత త్రివేది మాట్లాడుతూ హైదరాబాద్​లోని నోవాటెల్​లో సెప్టెంబర్​24న మిసెస్​ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ –2023 ఫైనల్​పోటీలు నిర్వహిస్తున్నామని అందులో కూడా చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ షో నిర్వహిస్తామన్నారు. ఎంతో కష్టపడి నేతన్నలు చేనేత వస్త్రాలు నేస్తుంటే కొంతమంది ప్రింట్ ను డూప్లికేట్ చేసి తక్కువ ధరకు మార్కెట్​లో అమ్ముతున్నారన్నారు. దీంతో చేనేత కార్మికులు నష్టపోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి వారిని అరికట్టాలని ఆమె కోరారు. గతేడాది ఇదే క్రమంలో ఫ్యాషన్ షో నిర్వహించామని భవిష్యత్తులో కూడా చేనేత వస్త్రాల ప్రమోషన్ కి  తమ సంస్థ ద్వారా శాయశక్తుల కృషి చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్, ప్రధాన కార్యదర్శి భరత లవ కుమార్ , చేనేత కార్మికులు పాల్గొన్నారు.