మమత ఇలాకాలో గెలిచిందిట్లా

ఇరవై ఏళ్ల క్రితం బెంగాల్‌లో బీజేపీ సాధించినవి రెండు సీట్లు. 1999లో 11.13 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ.. తాజా ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో18 సీట్లకు పెరిగింది. రాష్ట్రంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ని కొట్టేయాలన్న లాంగ్‌టైమ్‌ టార్గెట్‌ని మమతా బెనర్జీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అప్పట్లో తృణమూల్‌ కు  బీజేపీ సాయం చేసింది.. ఇప్పుడు బెంగాల్‌లో  రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరే. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మాత్రమే.

కొత్త ఏరియాలో ముందు ఎంట్రీ దొరికితే చాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే, ముందుగా మొలకెత్తడానికి ప్లేస్‌‌ దొరికితే చాలు, ఆ తర్వాత కొమ్మల్ని విస్తరించవచ్చనేది మోటీవేషన్‌‌ క్లాసులో చెప్పే పాఠం.  బీజేపీ ఈ పాఠాన్ని తు.చ. తప్పకుండా పాటించింది.  పశ్చిమ బెంగాల్‌‌లో ఒకప్పుడు తృణమూల్‌‌తో కలిసి రెండే సీట్లను  గెలిచిన బీజేపీ… తాజా ఎన్నికల్లో ఆ పార్టీ సాయం లేకుండా ఒంటరిగా 18 సీట్లు కైవసం చేసుకుంది. ఇది రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదు.  1999 నుంచి జరిగిన అయిదు ఎన్నికల్లోనూ బీజేపీ ఒక ప్లాన్‌‌ ప్రకారం తమ ఓటు బేస్‌‌ని పెంచుకుంటూ వచ్చింది.

తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ని  1998లో మమతా బెనర్జీ ఆరంభించినప్పుడు బీజేపీ ఫస్ట్‌‌ ఇన్విటేషన్‌‌ పంపించింది.  ఆ మరుసటేడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తృణమూల్‌‌ని నేషనల్‌‌ డెమొక్రటిక్‌‌ అలయెన్స్‌‌ (ఎన్‌‌డీఏ)లోకి కలుపుకుంది. అప్పట్లో ఒక సీనియర్‌‌ బీజేపీ లీడర్‌‌ ‘మా ఫస్ట్‌‌ టార్గెట్‌‌ పశ్చిమ బెంగాల్‌‌ నుంచి లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ని తరిమికొట్టడం’ అన్నారు. ఆ టార్గెట్‌‌ని మమత చాలా వేగంగా ఫినిష్‌‌ చేశారు.

1975 నుంచి దాదాపు 34 ఏళ్లపాటు తిరుగులేకుండా అధికారాన్ని కొనసాగించిన మార్క్సిస్టులకు చుక్కలు చూపించారు. యాంటీ ఎస్టాబ్లిష్‌‌మెంట్‌‌ ఓటును బీజేపీ, తృణమూల్‌‌ క్యాష్‌‌ చేసుకున్నాయి.  2011 వచ్చేసరికి తృణమూల్‌‌ ఒంటరిగానే బలంగా మారిపోయింది.  అప్పటివరకు  లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌పై పోరాడుతూ బీజేపీ పరోక్ష సహకారం అందిస్తూనే  ఉంది. ఇక ప్రస్తుతం తన గురిని తృణమూల్‌‌పై పెట్టింది.

మూడున్నర దశాబ్దాలుగా లెఫ్ట్‌‌ ఐడియాలజీకి ప్రభావితమైన పశ్చిమ బెంగాల్‌‌ని నెమ్మదిగా యు–టర్న్‌‌ తిప్పే ప్రయత్నం చేసింది.  2009లో ఒకే ఒక్క సీటు దక్కించుకున్నా బెదిరిపోలేదు.  ఎందుకంటే, అంతకుముందు 2004 ఎన్నికల్లో ఒక్క సీటుకూడా దక్కలేదు.  2014 నాటికి బెంగాలీయులు బీజేపీని సొంతం చేసుకోవడం మొదలెట్టారు.  దేశమంతా మోడీ హవా సాగిన ఆ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ రెండంటే రెండే సీట్లు గెలవగలిగింది.

పశ్చిమ బెంగాల్‌‌లో నలువైపుల పోటీ జరుగుతుంది. దానిలో లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ పైకి లేవకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యం. 2009 లోక్‌‌సభ ఎన్నికల్లో  లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ మొత్తానికి 43.3 శాతం ఓట్లు రాగా, వాటిలో సీపీఎం వాటా 33.1 శాతం ఓట్లు,  ఆ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్‌‌ డిజిట్‌‌లో ఓట్లు వచ్చాయి. కానీ, తృణమూల్‌‌కి31.18 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, అక్కడికి అపోజిషన్‌‌ బరిలో నుంచి కాంగ్రెస్‌‌ని పూర్తిగా సాగనంపేసినట్లే అయ్యింది.  ఇక, మిగిలినవి లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌, తృణమూల్‌‌, బీజేపీ  మాత్రమే. గడచిన ఏడేళ్లలో లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ ఓట్లు 22 శాతం మేర పడిపోయాయి.

మరో పక్క బీజేపీ ఓటు పర్సంటేజీ  పెరుగుతూ వస్తోంది. ఈ ఓట్లను అసెంబ్లీ ఎన్నికలనాటికి నిలుపుకోగలగాలి. బెంగాలీయులు లోక్‌‌సభ ఎన్నికల్లో దాదా మోడీని, అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ మమతను ఆదరిస్తున్నారు. అందువల్లనే 2014 లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీకి 17.02 శాతం ఓట్లు పడగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.16 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి.  మళ్లీ 2019 జనరల్‌‌ ఎలక్షన్స్‌‌లో 40 శాతం ఓట్లేసి బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు. ఈసారి పశ్చిమ బెంగాల్‌‌లోని 42 లోక్‌‌సభ స్థానాల్లో 18 సీట్లు గెలుచుకుంది.

మరోవైపు తృణమూల్‌‌ పరిస్థితి దిగజారింది. ఓట్ల పరంగా 15 స్థానాల్లో పర్సంటేజీ పడిపోయింది. అలాగే, 2014లో 34 సీట్లు గెలుచుకోగా, ఈసారి 12 పోగొట్టుకుని 22 సీట్లతో సరిపుచ్చుకుంది.  మొత్తంగా ఈ ఎన్నికల్లో తృణమూల్‌‌కి వచ్చిన ఓట్లు 43 శాతం.  అయితే, పశ్చిమ బెంగాల్‌‌లోని సదరన్‌‌ ఏరియాలో తృణమూల్‌‌ పట్టు నిలుపుకోగలిగింది. బీజేపీ తన బేస్‌‌ని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు విస్తరించింది.. రాష్ట్రంలో పోలయిన 83 శాతం ఓట్లను తృణమూల్‌‌, బీజేపీ చెరిసగం పంచుకోగలిగాయి.  కాంగ్రెస్‌‌ పార్టీకి గతంలో ఉన్న ఓటు బ్యాంక్‌‌ని ఈ రెండు పార్టీలు చీల్చుకుని 5 శాతానికి పరిమితం చేశాయి. ఒక అంచనాప్రకారం కాంగ్రెస్‌‌ ఓట్లలో 32 శాతాన్ని బీజేపీ, 29 శాతాన్ని తృణమూల్‌‌ రాబట్టుకున్నాయి.

బెంగాల్‌‌ పాలిటిక్స్‌‌లో మత ప్రమేయం చాలా తక్కువ. ఈ విషయాన్ని దీదీ మరచిపోయి… మొహర్రం ఊరేగింపును, దుర్గామాత నిమజ్జనాన్ని ముడిపెట్టి రాజకీయం చేయాలనుకున్నారని ఎనలిస్టులు విశ్లేషించారు. ఇలాంటి అవకాశాలకోసం కాచుకునే మతవాదులు ఇష్యూని పెద్దది చేశారు. మమత బెనర్జీ హిందువుల విషయంలో పక్షపాతం చూపుతున్నారని జనం భావించారని, అందువల్లనే గతంలో తృణమూల్‌‌ గెలుచుకున్న వాటిల్లో 14  స్థానాలు ఈసారి బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయని చెబుతున్నారు.

మైనారిటీలంతా తృణమూల్‌‌ వైపు నిలిస్తే… మెజారిటీ జనాభాలోని  సంపన్న వర్గాలు,  ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బీజేపీని ఆదరించినట్లు ఓటింగ్‌‌ ప్యాట్రన్‌‌నిబట్టి అంచనాకి వచ్చారు.  ఈశాన్య రాష్ట్రాలను గుప్పిట్లోకి తెచ్చేసుకున్న ఉత్సాహంతో బీజేపీ వెస్ట్‌‌ బెంగాల్‌‌లో విజృంభించబోతోంది. ఈ ఏడాదిలో జరగాల్సిన జమ్మూకాశ్మీర్‌‌, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌ అసెంబ్లీ ఎలక్షన్స్‌‌ ముగియగానే… 2021 నాటికి పశ్చిమ బెంగాల్‌‌నే టార్గెట్‌‌ చేసుకోనుంది.