- గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ నర్సింహులు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా నేరుగా జీతాలు ఇస్తామని చెప్పడం హర్షణీయమని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు సెక్రటేరియెట్ గేట్ ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సెక్రటేరియెట్ మీడియా పాయింట్ లో నర్సింహులు మాట్లాడారు. ఇన్నాళ్లూ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.
తమ కష్టాలు చూసి చలించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు మొదటి వారంలో జీతాలు ఇస్తామని చెప్పడం సంతోషకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి , మంత్రి సీతక్కకు గ్రామ పంచాయతీల ఉద్యోగుల తరపున ధన్యవాదాలు చెప్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఎక్కువ పని చేయించి తక్కువ జీతాలిచ్చిందని నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగుల కోసం తెచ్చిన 51 జీవో మెడపైన కత్తిలాగా వేలాడుతున్నందున ఈ జీవోనురద్దుచేసి కేటగిరీ వారీగా వర్క్ చాట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు బుర్ర సోమయ్య, రాగల లక్ష్మణ్, మేకల శ్రీధర్ ఉన్నారు.