విద్యాసంస్థల బస్సులకు  ఫిట్ నెస్ లేకుంటే కేసులు : మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

విద్యాసంస్థల బస్సులకు  ఫిట్ నెస్ లేకుంటే కేసులు : మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

గండిపేట, వెలుగు: విద్యాసంస్థల బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11,922 విద్యా సంస్థల బస్సులు ఉంటే, ఇందులో కేవలం 8,917 మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 3005 కూడా పొందాలని తెలిపారు. సోమవారం మణికొండ ఆర్టీఏ ఆఫీసు వద్ద బస్సుల ఫిట్ నెస్ ను చెక్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

15 ఏండ్లు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగరాదని, ఫిట్ నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్తే.. వాటిని సీజ్ చేయడమే కాకుండా ఓనర్లపై కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. అనుభవజ్ఞులైన, 60 ఏళ్లలోపు డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు.  రంగారెడ్డి జిల్లాలో  5,725కు 4,363, మేడ్చల్ జిల్లాలో 5,985కు 4,468, వికారాబాద్ జిల్లాలో 212 కు 86  బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉన్నాయని వివరించారు. మిగిలిన బస్సులు కూడా త్వర లో ఫిట్ నెస్ చేసుకోవాలని చెప్పారు. త్వరలో  విద్యాసంస్థల మేనేజ్ మెంట్లతో, డ్రైవర్ల తో మీటింగ్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.