సన్యాసం చిచ్చు..! కిన్నెర అఖాడా నుంచి బాలీవుడ్ నటి బహిష్కరణ

సన్యాసం చిచ్చు..! కిన్నెర అఖాడా నుంచి బాలీవుడ్ నటి బహిష్కరణ

ఇటీవల సన్యాసం తీసుకున్న అలనాటి బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి(Mamta Kulkarni)పై బహిష్కరణ వేటు పడింది. ఆమెను కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ పేర్కొన్నారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.

కుంభమేళా ప్రారంభంలో నటి మమతా కులకర్ణి సాధారణ జీవితాన్ని వదులుకొని సన్యాస దీక్షను స్వీకరించారు. కాషాయ వస్త్రాలు, నుదుటిపై తిరకం, మెడలో మాలలతో కనిపించారు. ఆమె పేరును శ్రీమాయి మమతానంద్ గిరిగా ప్రకటించి మహామండలేశ్వర్‌గా నియమించారు. ఇదే వివాదాస్పదమైంది. ఒక నటిని మహామండలేశ్వరుడిగా నియమించడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. దాంతో వీరిద్దరిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

"కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడిగా.. ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని ఆచార్య మహామండలేశ్వర్ పదవి నుంచి తప్పిస్తున్నాను. తక్షణమే ఇది అమల్లోకి వస్తుంది. మతపరమైన కార్యకలాపాలను ప్రోత్సహించడం, లింగమార్పిడి సమాజాన్ని ఉద్ధరించడం లక్ష్యంగా ఆయన నియామకం జరిగింది. కానీ ఆయన తన బాధ్యతలను విస్మరించారు.." అని జనవరి 30, 2025న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రిషి అజయ్ దాస్ పేర్కొన్నారు. 

ALSO READ | మహా అద్భుతం : 27 ఏళ్ల తర్వాత అఘోరాగా కుంభమేళాలో కనిపించిన గ్యాంగ్ స్టర్ యాదవ్

నటి మమతా కులకర్ణి చేరిక తన ఆమోదం లేకుండా జరిగిందని అజయ్ దాస్ పేర్కొన్నారు. మమతా కులకర్ణికి గతంలో నేర చరిత్ర (డ్రగ్స్) ఉన్నందున ఆమె నియామకం చాలా ఆందోళన కలిగిస్తోందని అజయ్ దాస్ వివరించారు. అలాంటి వ్యక్తికి మహామండలేశ్వరుని బిరుదు ఇవ్వడం ద్వారా, మీరు సనాతన ధర్మానికి ఎలాంటి గురువును సమర్పిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. నటి నియామకం అనైతికం మాత్రమే కాదు, అఖాడా మతపరమైన విలువలకు ద్రోహం కూడా అని వ్యవస్థాపకుడు అజయ్ దాస్ ఉద్ఘాటించారు. 

వ్యతిరేకించిన అఖాడా పరిషత్ అధ్యక్షుడు

వీరి బహిష్కరణ కొత్త చర్చకు దారి తీసింది. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర త్రిపాఠి వీరికి మద్దతు పలికారు. బహిష్కరించడానికి రిషి అజయ్ దాస్ ఎవరు అని ప్రశ్నించారు. వీరిద్దరు అఖాడాలో తమ విధుల్ని కొనసాగిస్తారని, రాబోయే అమృత స్నానంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.