![Mamata Kulkarni: సన్యాసం తీసుకున్న కొన్నాళ్లకే తీవ్ర వివాదం.. ఆ పదవికి రాజీనామా.. ఇన్స్టాలో వీడియో](https://static.v6velugu.com/uploads/2025/02/mamta-kulkarni-resigns-as-mahamandaleshwar-days-after-outrage-shares-video-on-instagram_6d0SKRHguT.jpg)
మమతా కులకర్ణి.. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులోనూ నటించి ఎంతో మంది ప్రేక్షలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు, మీడియాకు దూరంగా ఉండిపోయింది. ఈ మధ్యే మహాకుంభమేళా వేదికగా సన్యాసం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. తమ అందాల తార సన్యాసం తీసుకోవడంతపై దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఆ మధ్య పెద్ద చర్చే జరిగింది. తాజాగా తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం మరోసారి చర్చకు దారితీసింది.
కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మమతా కులకర్ణి ప్రకటించింది. మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న అనంతరం మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ ను చేస్తూ మహా మండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి వివాదం తలెత్తింది. హీరోయిన్ కు మహామండలేశ్వర్ పదవి ఎలా ఇస్తారని కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదే విధంగా వివిధ మఠాధిపతులు కూడా వ్యతిరేకించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో రాజీనామా చేస్తున్నట్లు ఇన్ స్టా లో వీడియో పోస్ట్ చేసింది.
Also Read :- ఒక్క మాటకు వేల ట్వీట్స్ ఏంటీ
‘‘మహామండలేశ్వర్ మమతా నంద్గిర్ అనే నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండటం సరికాదు. 25 ఏండ్లుగా సాధ్విగా ఉన్నాను. ఉంటాను కూడా. మహామండలేశ్వర్ గౌరవం దక్కడం అంటే.. 25 ఏళ్లుగా స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత పిల్లలకు నేర్పమని బాధ్యత ఇచ్చినట్లుగా భావిస్తాను. కానీ దీనిపై వివాదం చెలరేగడం బాలేదు. బాలీవుడ్ నుంచి 25 ఏళ్ల క్రితమే బయటికి వెళ్లిపోయాను. అందరికీ.. అన్నింటికీ దూరంగా ఉన్నాను. దీనిపై ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకున్నారు. అయితే నేను మహా మండలేశ్వర్ గా బాధ్యతలు తీసుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉన్నట్లుంది. వాళ్లు శంకరాచార్య లేదా ఇంకెవరైనా కావచ్చు. ఈ పదవులతో నేను కైలాసమో.. మానస సరోవరమో వెళ్లాలని లేదు. గత 25 ఏళ్లుగా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాంటి ప్రపంచంలో ప్రశాంతంగా గడుపుతాను’’ అని ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది.
మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న అనంతరం మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ ను చేస్తూ మహా మండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని బహిష్కరిస్తున్నట్లు రిషి అజయ్ దాస్ ప్రకటించారు. అయితే రిషి అజయ్ దాస్ ను 2017లోనే బహిష్కరించారని, తనను బహిష్కరించడానికి అతనెవరని లక్ష్మీనారాయణ్ త్రిపాఠి అన్నారు. ఈ వివాదం ముదురుతుండటంతో ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మమతా కులకర్ణి ప్రకటించారు.