- మెరుగుల కోసం పాలిష్ చేసుకురమ్మని పంపగా మస్కా
- పట్టుకునేంతలో 4 కిలోలు అమ్ముకున్నడు
- నిజామాబాద్‌లో నిందితుడి పట్టివేత
నిజామాబాద్, వెలుగు: హైదరాబాద్ వెళ్లి 14.5 కిలోల వెండి ఆభరణాలను పాలిష్ చేసుకురమ్మని యజమాని తన ఇద్దరు వర్కర్లకు ఇచ్చి పంపగా అందులో ఒకరు ఆభరణాలతో పరారయ్యాడు. అయితే, అతడిని రైల్వే పోలీసులు పట్టుకోగా ఆ లోపే నాలుగున్నర కిలోల వెండిని అమ్మేశాడు. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి కథనం ప్రకారం...మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన సిల్వర్ మర్చెంట్ రాహుల్వెండి ఆభరణాలు తయారు చేసి పాలిష్ చేయించడానికి హైదరాబాద్ పంపిస్తూ ఉంటాడు.
శనివారం రాత్రి14.5 కిలోల పట్టీలు, తాడును తన వద్ద పనిచేసే సునీల్, నదీంకు ఇచ్చి నాందేడ్‌లో ట్రైన్ ఎక్కించాడు. రైలు నిజామాబాద్‌కు వచ్చే సరికి అర్ధరాత్రి ఒంటిగంట దాటింది. సునీల్ నిద్రలోకి జారుకున్న తర్వాత నదీం తన వద్ద ఉన్న వెండి ఆభరణాల బ్యాగుతో నిజామాబాద్‌లో దిగిపోయాడు. ఇంతలో సునీల్‌కు మెలకువ రాగా..నదీం కోసం చూశాడు. అతడు కనిపించకపోవడంతో ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో తన యజమానికి సమాచారం ఇచ్చి మరో ట్రైన్లో నాందేడ్ తిరిగి వెళ్లిపోయాడు.
ఆదివారం నిజామాబాద్చేరుకున్న వ్యాపారి రైల్వే పోలీసుకు కంప్లయింట్ఇచ్చాడు. ఇంతలోనే నిజామాబాద్, బోధన్పట్టణాల్లో సుమారు నాలుగున్నర కిలోల ఆభరణాలు అమ్మిన నిందితుడు..మిగితా వెండిని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ట్రైన్లో వెళ్లడానికి సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ వచ్చాడు. దీంతో అతడిని పట్టుకుని 10 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.