
తూప్రాన్, వెలుగు : అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తి చివరకు అందరినీ మోసం చేసి ఉడాయించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో బుధవారం వెలుగు చూసింది. తూప్రాన్ పట్టణానికి చెందిన బిజిలిపురం యాదగిరి ఓ ప్రైవేట్ కంపెనీలో రోజువారీ కూలిగా పనిచేసేవాడు. తనతో పనిచేసే వారితో పరిచయం పెంచుకొని తనకు డబ్బులు ఇస్తే అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టాడు. అలాగే ఫ్రెండ్స్, బంధువుల నుంచి సైతం డబ్బులు తీసుకోవడమే కాకుండా, వారి పేరున పర్సనల్, హౌజింగ్ లోన్లు ఇప్పించి ఆ డబ్బులను కూడా తనే వాడుకున్నాడు.
అధిక వడ్డీ వస్తుందని ఆశ పడిన వారు స్నేహితుల వద్ద నుంచి 2, 3 రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి యాదగిరికి డబ్బులు ఇచ్చారు. మొదట్లో కొందరికి వడ్డీ కట్టిన యాదగిరి మరికొందరికి ఈ నెల 5న డబ్బులు ఇస్తానని చెప్పారు. కానీ 4వ తేదీ నుంచే భార్య, పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు యాదగిరి ఇంటికి వెళ్లగా చాలా మందిని మోసం చేసి డబ్బులతో పారిపోయిన విషయం బయటపడింది. బాధితులు తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 60 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.