బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హత్య బెదిరింపుల కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఫైజాన్ ఖాన్.. రాయ్‌పూర్ నివాసి. అతనొక న్యాయవాది. కాకపోతే, ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ ఉంది. తాను షారుఖ్‍ను బెదిరించలేదని, తన ఫోన్ ఎవరో దొంగలించి ఆ పని చేశారని నిందితుడు పోలీసుల కస్టడీలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 5న ఆగంతకుడు బాద్ షా నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాల్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే షారుఖ్‌ను చంపేస్తామని బెదిరించాడు. దీనిపై విచారణ మొదలుపెట్టిన ముంబై పోలీసులు ఫోన్‌నంబర్ ఆధారంగా కాల్ చేసిన నిందితుడిని ఫైజాన్గా గుర్తించారు. విచారణకు హాజరవ్వాల్సిందిగా అతనికి నోటీసులిచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైజాన్ పోలీసుల ఎదుట హాజరు కాకపోవడంతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ
ఈ కేసులో తన పేరు తెరపైకి వచ్చిన నాటి నుండి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫైజాన్ ఖాన్ రెండ్రోజుల క్రితం ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. అందులో తన భద్రతను ఉటంకిస్తూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని అభ్యర్థించాడు.