మధ్యప్రదేశ్లో ఓ గ్రామస్థులకు వింత అనుభవం ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. అయితే ఓట్ల కోసం జనానికి పంచిన సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు వ్యక్తిపై కేసు బుక్ చేశారు.
మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలోని దేవ్ రణ్ గ్రామంలో ఈ మధ్యనే సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. ఎన్నికల్లో రాజు దేమా అనే వ్యక్తి పోటీ చేశాడు. ప్రచారం సందర్భంగా తనకే ఓటేయాలని గ్రామస్థులకు డబ్బు పంచిపెట్టాడు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యాడు. దీంతో ఆగ్రహించిన రాజు గ్రామస్థులు తనను మోసం చేశారని అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఓటేస్తామని హామీ ఇచ్చి తన వద్ద డబ్బు తీసుకున్నవారందరినీ ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు. సదరు వ్యక్తి పైసలు తిరిగివ్వాలని జనాన్ని బెదిరిస్తున్న వీడియో ఒకటి రాంపూర్ పోలీసుల దృష్టికి రావడంతో రాజు దేమాపై ఐపీసీ సెక్షన్ 323, 294, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం మరిన్ని సెక్షన్లు పెట్టే అవకాశముందని పోలీసులు వెల్లడించారు.