బాలికతో పెళ్లి.. 26 ఏళ్ల యువకుడు అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: మైనర్ బాలికను పెళ్లి చేసుకొని, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అల్లగడపకు చెందిన వంశీ (26) ఫొటోగ్రాఫర్ పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలిక ఇటీవల డిగ్రీ చదివేందుకు కోఠి ఉమెన్స్ కాలేజీలో చేరి, హాస్టల్​లో ఉంటోంది. 

ఈ నెల 2న హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడంతో కాలేజీ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు తమ కూతురు కనిపించడంలేదని సుల్తాన్ బజార్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాదర్ ఘాట్ చౌరస్తాలో బాలికతో పాటు ఉన్న వంశీని గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్​కు తరలించి విచారించగా , ఈ నెల 3న బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు అంగీకరించాడు. అయితే, మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు వంశీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.