ఫేక్‌ సర్టిఫికెట్‌తో ఆస్తులు కాజేసిన వ్యక్తి అరెస్ట్‌

ఫేక్‌ సర్టిఫికెట్‌తో ఆస్తులు కాజేసిన వ్యక్తి అరెస్ట్‌
  • సహకరించిన ఐదుగురిపై కేసు

కరీంనగర్, వెలుగు : ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టించి, తల్లికి, అక్కకు తెలియకుండా ఆస్తులు కాజేసిన వ్యక్తితో పాటు అతడి ఫ్రెండ్‌ను అరెస్ట్‌ చేయగా, సహకరించిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్‌ బి.కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... 

హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ ఏరియాకు చెందిన జోరేపల్లి కృష్ణకుమారి, సుబ్బారెడ్డి దంపతులకు కొడుకు ప్రదీప్‌రెడ్డి, కూతురు సుచరిత ఉన్నారు. సుచరిత అమెరికాలో ఉంటోంది. సుబ్బారెడ్డి కరీంనగర్‌లో గ్రానైట్, ఇతర వ్యాపారాలు చేస్తూ వచ్చిన ఆదాయంతో స్థానికంగా భూములు కొనుగోలు చేశాడు. 

2014లో ఆయన చనిపోయాడు. కొంత కాలం తర్వాత ప్రదీప్‌రెడ్డి ఐటీ దాడులు జరుగుతున్నాయని తల్లికి చెప్పి ఆస్తి కాగితాలు, తండ్రి డెత్‌ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లు తీసుకెళ్లాడు. తర్వాత కరీంనగర్‌‌లోని చైతన్యపురిలో 2–-10-–1760 ఇంటి నంబర్‌తో ఫేక్‌ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ తీసుకొని తన తండ్రి సుబ్బారెడ్డి పేరిట సుల్తానాబాద్‌లో ఉన్న 2.11 ఎకరాలు, గ్రానైట్‌ క్వారీ లీజును తన పేరుపైకి మార్చుకున్నాడు. 

విషయం తెలుసుకున్న కృష్ణకుమారి కరీంనగర్ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ బి.కోటేశ్వర్ కేసు నమోదు చేసి విచారించగా నిజమేనని తేలింది. దీంతో ప్రదీప్‌రెడ్డితో పాటు అతడి స్నేహితుడు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఫేక్‌ ఫ్యామిలీ మెంబర్‌, డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.