![ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/man-arrested-for-duping-thousands-in-share-market-trading-scam-in-narayanpet-district_5sBAh6DRGg.jpg)
- వేలాది మందికి రూ. 70 కోట్ల వరకు టోకరా
- మూడేండ్ల తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు
మక్తల్, వెలుగు : షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో నారాయణపేట జిల్లా మక్తల్‌లో వేలాది మంది నుంచి కోట్లు వసూలు చేసి పారిపోయిన ఓ వ్యక్తిని మూడేండ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఇప్పుడైనా తమ డబ్బులు తిరిగి వస్తాయని బాధితులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలోని రామకృష్ణారావుపేటకు చెందిన మహబూబ్ సుభాని 2019 నుంచి 2021వరకు మక్తల్‌లో మిత్ర ఫర్టిలైజర్ షాపును నడిపించాడు.
ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో లాభాలు బాగా ఉంటాయని, రూ. లక్ష పెడితే వారంలోనే రూ. 30 వేలు అదనంగా వస్తాయని నమ్మించాడు. మొదట్లో డబ్బులు ఇచ్చిన వారికి వారంలోనే రూ. 30 వేలు అదనంగా ఇచ్చేవాడు. దీంతో నిజమేనని నమ్మిన నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, మరికల్, మాగనూర్ మండలాలకు చెందిన వేలాది మంది షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.
దీంతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సుభాని ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను నియమించాడు. ఇలా వేలాది మంది వద్ద మొత్తం రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఆ డబ్బులతో సుభాని మక్తల్ మండలం మంథన్ గోడ్, ఊట్కూర్ మండలంలో 30 ఎకరాల భూమి, మక్తల్ పట్టణంలో ఫ్లాట్లను కొనుగోలు చేశాడు. తర్వాత 2021ఆగస్టు 21న మక్తల్ నుంచి పరార్ అయ్యాడు.
విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న మహబూబ్ సుభానీని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో తమ డబ్బులు ఇప్పుడైనా తిరిగి వస్తాయోమోనని బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఫోన్‌లో కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డితో మాట్లాడారు. సుభానీ చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.