ప్రేమించిన అమ్మాయి దూరం.. యువతి తండ్రిపై ఫైరింగ్

ప్రేమించిన అమ్మాయి దూరం..  యువతి తండ్రిపై ఫైరింగ్
  •  నిందితుడి నుంచి ఎయిర్ రైఫిల్, షార్ట్ పిస్టల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు  

ఎల్బీనగర్, వెలుగు: తాను ప్రేమించిన అమ్మాయిని తన నుంచి దూరంగా పంపించారనే కోపంతో ఓ యువకుడు యువతి తండ్రిపై కాల్పులకు దిగాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌‌ నగర్‌‌లోని వెంకటేశ్వర కాలనీలో పెరిశేట్టి రేణుకా ఆనంద్ (57) భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. చిన్న కుమార్తె మన్వీత(23) గడ్డి అన్నారంలోని వికాస్ భారతి స్కూల్లో 7వ తరగతి చదివే సమయంలో అంబర్‌‌ పేటకు చెందిన బల్వీందర్ సింగ్‌ (25)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి  ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో  యువతి తండ్రి ఆనంద్, యువకుడు బల్వీందర్ సింగ్ కు గతంలోనే  గొడవలు జరిగాయి. తన ప్రేమకు అడ్డు వస్తే చంపేస్తానని యువతి తండ్రిని గతంలోనే  బల్వీందర్ సింగ్  బెదిరించాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఎవరూ ఇబ్బందులు పెట్టుకోకూడదని నిర్ణయానికి వచ్చారు.  ఈ మధ్య ఎవరికీ చెప్పకుండా మన్వీత (23)ను అమెరికాకు ఆమె తల్లిదండ్రులు పంపించేశారు.  దీంతో కోపోద్రికుడైన యువకుడు షూటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు తెచ్చుకున్న ఎయిర్ రైఫిల్, షార్ట్ గన్ తో యువతి తండ్రి ఆనంద్ పై కాల్పులు జరిపాడు. తప్పించుకున్న ఆనంద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

యువతి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు బల్వీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ఎయిర్ రైఫిల్, షార్ట్ ఫిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.  కాల్పుల్లో యువతి తండ్రికి స్వల్ప గాయాలు కాగా అతడిని ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని రిమాండ్ తరలించినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.