మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్తాన్ జెండా ఎగరేసి అరెస్టయ్యాడు. షిప్రా గ్రామానికి చెందిన ఫారూఖ్ ఖాన్… తన నివాసంపై పాక్ జెండా ఎగురవేశాడు. అంతేకాదు.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. ఆ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే స్పందించి ఫారూఖ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
సామాజిక సామరస్యతకు భంగం కలిగిస్తున్నాడన్న ఆరోపణలపై ఫారుఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. అతడి నివాసం నుంచి పాక్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ జెండా ఎగురవేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఫారూఖ్ ఖాన్ ను ప్రశ్నించగా, మైనర్ అయిన తన కుమారుడు తెలియక ఎగరేశాడంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆ జెండాను తాను అప్పుడే తగులబెట్టానంటూ అధికారులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ సోదాలు చేయగా, ఆ జెండా సాధారణ స్థితిలోనే లభ్యమైంది. దాంతో అతడిపైనా, అతడి కుటుంబంలోని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫారూఖ్ ఖాన్ షిప్రా గ్రామంలో టైర్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.