స్విఫ్ట్‌‌‌‌ కారు ఇంజిన్‌‌‌‌ కింది భాగంలో గంజాయి దొరికింది.. 102 కిలోల గంజాయి పట్టివేత..

స్విఫ్ట్‌‌‌‌ కారు ఇంజిన్‌‌‌‌ కింది భాగంలో గంజాయి దొరికింది.. 102 కిలోల గంజాయి పట్టివేత..

చౌటుప్పల్, వెలుగు: కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ రాజేశ్‌‌‌‌ చంద్ర ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నిఖిల్‌‌‌‌ కైలాస్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ ఏపీలో గంజాయి కొని మహారాష్ట్రలో అమ్మేవాడు. ఈ క్రమంలో నష్టాలు వస్తుండడంతో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి గంజాయి సరఫరా చేసేందుకు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాడు.

ఇందులో భాగంగా ఏపీలోని నర్సీపట్నంలో వీరబాబు అనే వ్యక్తి వద్ద 102 కిలోల గంజాయి కొని స్విఫ్ట్‌‌‌‌ కారు ఇంజిన్‌‌‌‌ కింది భాగంలో పెట్టుకొని మహారాష్ట్రకు వెళ్తున్నాడు. సమాచారం తెలుసుకున్న చౌటుప్పల్‌‌‌‌ ఏసీపీ మధుసూదన్‌‌‌‌రెడ్డి తన సిబ్బందితో చౌటుప్పల్‌‌‌‌ మండలం పంతంగి టోల్‌‌‌‌ ప్లాజా వద్ద కారుతో పాటు, 102 కిలోల గంజాయి, రెండు సెల్‌‌‌‌ఫోన్లు, మూడు నంబర్‌‌‌‌ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.

కైలాస్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు తెలిపారు. గంజాయి అమ్మిన, నర్సీపట్నంకు చెందిన వీరబాబును, మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీసీపీ చెప్పారు. నిందితుడు ఏ రాష్ట్రంలోకి వస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన నంబర్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ను కారుకు తగిలించి గంజాయి సరఫరా చేస్తుంటాడని తెలిపారు. కైలాస్‌‌‌‌పై మహారాష్ట్ర, రాజమండ్రి, భవానీపురం, మాదాపూర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో పలు కేసులు నమోదైనట్లు డీసీపీ వివరించారు. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌‌‌‌రెడ్డి, సీఐ మన్మథకుమార్‌‌‌‌, ఎస్సైలు యాదగిరిగౌడ్, కృష్ణ మల్లు, భాస్కర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.