హోలీ.. ఎంతో హుషారుగా, ఆనందోత్సాహంతో జరుపుకునే పండగ. కానీ, కొందరు ఆకతాయులు చేసే పనుల వల్ల.. హోలీ సంబరాలు గోడవలకు దారి తీస్తుంటాయి. అలాంటి ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హోలీ సంబరాలు.. ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చాయి. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా మండలం తిప్పన్నపేట గ్రామంలో హోలీ సంబరాలు దాడులకు దారి తీశాయి.
కోడి గుడ్లతో హోలీ సంబరాలు చేసుకుంటున్న ప్రకాశ్ అనే వ్యక్తి... ఓ గుడ్డును రమా అనే మహిళ ఇంట్లోకి విసిరాడు. దీంతో ఇంట్లోకి కోడిగుడ్డు విసిరింది ఎవరని ఆమె కుమారుడు రిషీ ప్రశ్నించగా.. ప్రకాశ్ ఇంట్లోకి వెళ్లి అతనిపై దాడి చేశాడు. ఈక్రమంలో అడ్డుకున్న రమాపై ప్రకాశ్ కొడవలితో దాడి చేసి మెడపై నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.