పటాన్ చెరు, వెలుగు : ఇస్నాపూర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపట్లేదని ఓ వ్యక్తి తన అత్తపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన భార్య గొంతును కూడా కోశాడు. ఈ ఘటనలో అత్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పటాన్ చేరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలో ఉండే శాంతమ్మ(40) తన కుమార్తె సత్యవతి(22)ని రుద్రవరానికి చెందిన సాయిబాబా (26)కు ఇచ్చి పెండ్లి చేసింది. అయితే, ఇటీవల దంపతుల మధ్య గొడవ కావడంతో సత్యవతి పుట్టింటికి వెళ్లింది.
రోజులు గడుస్తున్నా తిరిగి కాపురానికి రాలేదు. తన భార్య సత్యవతిని అమె తల్లి శాంతమ్మే కాపురానికి పంపడం లేదని సాయిబాబా కోపం పెంచుకున్నాడు. బుధవారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లాడు. శాంతమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. భర్య అడ్డుపడగా..ఆమె గొంతును కోసేశాడు. అనంతరం పటాన్ చేరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యవతి ట్రీట్మెంట్ పొందుతున్నది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.